కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..

కాంగ్రెస్ లోకి రిటర్న్ టు హోం..వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే..

 రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు మళ్లీ పాత రోజులు తిరిగివస్తున్నాయి. వివిధ కారణాలతో ఆ పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులంతా.. ఇప్పుడు తిరిగి సొంతగూటికి చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేరికల కార్యక్రమాన్ని పీసీసీ ప్రారంభించింది. అధికారంలోకి వచ్చాక చేరికల జోరు మరింత పెరిగింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌, సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్‌‌ తిరిగి కాంగ్రెస్‌‌లో చేరారు. గతంలో కాంగ్రెస్‌‌లో పనిచేసిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు సొంతగూటికి వచ్చేశారు. 

రిటర్న్‌‌‌‌ టు హోమ్‌‌‌‌

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ హవా నడిచింది. ఇప్పుడు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీలో ఉన్న నాయకుల్లో మెజార్టీ లీడర్లు కాంగ్రెస్‌‌‌‌లో ఎదిగినవాళ్లే. కాగా.. తెలంగాణ ఏర్పడి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌‌‌‌ నేతలను నయానో, భయానో టీఆర్​ఎస్​ (బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌)లో చేర్చుకున్నారు. ఈ క్రమంలో ఏకంగా కాంగ్రెస్‌‌‌‌ ఎల్పీనే చీల్చి టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో విలీనం చేసుకున్నారు. ఓ వైపు కాంగ్రెస్‌‌‌‌పై కేసీఆర్ చేస్తున్న దాడి, మరోవైపు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో చాలా మంది కాంగ్రెస్‌‌‌‌ను వదిలి గులాబీ కండువా కప్పుకున్నారు. 

ఇప్పుడు వాళ్లంతా తిరిగి కాంగ్రెస్‌‌‌‌ వైపు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌లో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌.. ఇటీవలే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి కాంగ్రెస్‌‌‌‌కు తిరిగొచ్చారు. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌‌‌‌సభకు ఆయన పోటీపడుతున్నారు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌‌‌‌ కూడా కాంగ్రెస్‌‌‌‌కు తిరిగొచ్చారు. ఆయన రాజకీయ జీవితం కాంగ్రెస్‌‌‌‌లోనే ప్రారంభమైంది. 

కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థిగా కల్వకుర్తిలో ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ను ఓడగొట్టి చరిత్ర సృష్టించిన మాజీ మంత్రి జె. చిత్తరంజన్‌‌‌‌ దాస్.. కొన్నాళ్ల కింద బీజేపీలో చేరారు. ఇటీవలే ఆయన తిరిగి కాంగ్రెస్‌‌‌‌లోకి వచ్చారు. 2014లో కాంగ్రెస్ నుంచి ముథోల్‌‌‌‌ ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి మారిన విఠల్ రెడ్డి కాంగ్రెస్‌‌‌‌లోకి తిరిగొచ్చారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్‌‌‌‌పై ఆయన ఓడిపోయారు.

వచ్చే వాళ్ల లిస్టు పెద్దదే

కాంగ్రెస్‌‌‌‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్న లీడర్ల లిస్ట్  పెద్దగానే ఉంది. కాంగ్రెస్‌‌‌‌లో వివిధ హోదాలో పనిచేసి, ప్రస్తుతం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ సెక్రటరీ జనరల్‌‌‌‌గా ఉన్న కె.కేశవరావు తిరిగి తన మాతృపార్టీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. తన కూతురు, జీహెచ్​ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి ఆయన కాంగ్రెస్ గూటిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. గతంలో కాంగ్రెస్ ఎంపీగా పనిచేసి, ప్రస్తుతం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మరో నాయకుడు కూడా కాంగ్రెస్‌‌‌‌కు దగ్గరయ్యారు.

 వైఎస్ఆర్‌‌‌‌‌‌‌‌ మంత్రివర్గంలో పనిచేసి ప్రస్తుతం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో ఉన్న ఓ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌‌‌‌లో చేరనున్నట్టు తెలుస్తున్నది. మరికొంత మంది పాత నేతలు కూడా హస్తం పార్టీతో చేతులు కలిపేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్‌‌‌‌ నుంచి వెళ్లిపోయిన నేతలే కాదు.. టీడీపీ నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోకి పోయిన నాయకులు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లోనే పుట్టి పెరిగిన నాయకులు కూడా కాంగ్రెస్‌‌‌‌లోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.