
- మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శ
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదని, ఆర్ఆర్ఎస్ భావజాలం ఉన్న మోదీ మనిషి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. ఈ విషయాన్ని తాము ముందు నుంచి చెబుతున్నామని, లిక్కర్ స్కామ్ కేసులో ఆయన వ్యవహరిస్తున్న తీరుతో ఈ విషయం మరోసారి నిజమని తేలిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సీబీఐ వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ స్పందిస్తున్న తీరుకు విరుద్ధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీకి బీ టీమ్ లీడర్‌లా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని చెప్పారు. జాతీయ కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రతినిధిగా రేవంత్ వ్యవహరిస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో ఆయన పనిచేయడం లేదని, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా, బీజేపీకి, మోదీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు.