ఎండిపోయిన ఆకులు రాలిపోయినా.. కాంగ్రెస్లోకి  కొత్త ఆకులు వస్తాయ్: రేవంత్ రెడ్డి

ఎండిపోయిన ఆకులు రాలిపోయినా.. కాంగ్రెస్లోకి  కొత్త ఆకులు వస్తాయ్: రేవంత్ రెడ్డి

కొందరు కాంగ్రెస్ ను వీడి ఏదో చేయాలనుకున్నారు కానీ.. వారి వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  ఎండిపోయిన ఆకులు రాలిపోయినా.. కాంగ్రెస్ లోకి  కొత్త ఆకులు వస్తాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ఇసుకు మాఫియాకు అడ్డొచ్చారని దళిత యువకులను తొక్కించారు..ఖమ్మం జిల్లాలో గిరిజన రైతులకు బేడీలు వేయించారు..మరి నీ బిడ్డ, నీ కొడుకు మీద అవినీతి ఆరోపణలు వస్తే ఎందుకు పదవుల నుంచి తొలగించడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్.

మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు.  ఆరోగ్యశ్రీని 5  లక్షల రూపాయలకు పెంచుతామన్నారు రేవంత్.  500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని.. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్.