బషీర్ బాగ్లో రైతుల కాల్పుల ఘటనకు కేసీఆరే కారణం..ఉచిత విద్యుత్కు కట్టుబడి ఉన్నాం

బషీర్ బాగ్లో  రైతుల కాల్పుల ఘటనకు  కేసీఆరే కారణం..ఉచిత విద్యుత్కు కట్టుబడి ఉన్నాం

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విష‌యంలో తానా సభల్లో  చేసిన కామెంట్స్ ను కావాల‌ని బీఆర్ఎస్ పార్టీ  వ‌క్రీక‌రించారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ అతితెలివితో తన మాటలను ఎడిట్ చేసి ట్రోల్ చేయించారని విమర్శించారు. వాళ్లకు కావాల్సిన బిట్ ను కట్ చేసి ట్రోల్ చేయించారని దుయ్యబట్టారు. తాను కూడా రైతు కుటుంబం నుంచి వ‌చ్చాన‌ని, అన్నదాత‌లు క‌ష్టాలు, నష్టాలు ప‌డుతున్నారో తనకు తెలుసన్నారు. దమ్ముంటే కేటీఆర్ తనతో కలిసి దుక్కి దున్నాలని సవాల్ విసిరారు. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిగా ఉంది బీఆర్ఎస్ తీరు అని ఎద్దేవా చేశారు. 

బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆరే కారణం..

అనాటి బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆరే కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బషీర్ బాగ్ లో రైతులను కాల్చి చంపిందే కేసీఆర్ అని మండిపడ్డారు. ఈ ఘటనలో కేసీఆర్ టిడిపిలో భాగస్వామిగా ఉన్నారని గుర్తు చేశారు. 

ఉచిత విద్యుత్ పథకం ప్రారంభించిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2004లో 7 గంటల ఉచిత విద్యుత్ ఫైల్ పై అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతకం చేశారని చెప్పారు. ఆ తర్వాత 2009లో 7 గంటల ఉచిత విద్యుత్ ను  9 గంటలకు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వమని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ వెలుగులకు కాంగ్రెస్ పార్టీ కారణమన్నారు.  ఉచిత విద్యుతే కాదు..రైతులకు సబ్సిడీ మీద ఎరువులు, ఇతర పనిముట్లు అందజేశామన్నారు. రైతులకు రుణ విముక్తి చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఉచిత విద్యుత్ పై  కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున ఎలాంటి చ‌ర్చకైనా సిద్దంగా ఉన్నాన‌ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉచిత విద్యుత్ పేరుతో రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ స‌ర్కార్ ,  సీఎం కేసీఆర్ వంద‌ల కోట్లు అప్పులు తీసుకు వ‌చ్చార‌ని రేవంత్ రెడ్డి ఆరోపించారు.  దీని వ‌ల్ల ప్రజలపై  అద‌న‌పు భారం ప‌డుతుంద‌న్నారు.  ఉచిత విద్యుత్ రైతుల‌కు తాము కూడా ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి  ప్రక‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేద‌న్నారు. తాను 24 గంట‌ల పాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా చేయ‌డం వ‌ల్ల ఎంతో ధ‌ర‌కు కొనుగోలు చేసిన విద్యుత్ స్టార్టర్లు,  మోటార్లు కాలి పోతున్నాయ‌ని  ఆవేద‌న వ్యక్తం చేశానని..రైతుల గురించి..ఉచిత విద్యుత్ వద్దు అన్న అంశంపై ఒక్క మాట కూడా అన‌లేద‌న్నారు .

కేసీఆర్ ను చెత్తబుట్టలో వేస్తాం

ప్రజలకు నష్టాలను , కష్టాలను కలిగించే కేసీఆర్ ను చెత్త బుట్టలో పడేస్తామని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరు మీద దోపిడి చేశారని చెప్పారు. దళితబంధు మీద కమిషన్ తీసుకున్నారని..అన్ని పథకాలతో ప్రజలను దోపిడి చేసిన కేసీఆర్ ను రాష్ట్రంలో  రద్దు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.