కేసీఆర్​ను రక్షించేందుకే కామారెడ్డిలో రేవంత్ పోటీ : కిషన్ రెడ్డి 

కేసీఆర్​ను రక్షించేందుకే కామారెడ్డిలో రేవంత్ పోటీ : కిషన్ రెడ్డి 
  • తండ్రీకొడుకులకు  ఓటమి తప్పదు .. రెండుచోట్లా కేసీఆర్ ఓడిపోతడు
  • కేసీఆర్​ను రక్షించేందుకే కామారెడ్డిలో రేవంత్ పోటీ
  • సీఎంగా కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణకు అరిష్టమే 
  • ఆయనకు దమ్ముంటే మెడికల్ కాలేజీలపై చర్చకు రావాలని సవాల్
  • పార్లమెంట్ ఎన్నికల వరకు కారుకూతలు తప్ప.. కారు కనిపించదని కామెంట్ 

హైదరాబాద్, వెలుగు:  అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఓడిపోవడం ఖాయమని కేసీఆర్, కేటీఆర్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. గజ్వేల్, కామారెడ్డిలో రెండుచోట్లా కేసీఆర్ కు ఓటమి తప్పదని చెప్పారు. ఆ రెండుచోట్లా బీజేపీ అభ్యర్థులే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘గజ్వేల్ లో ఓడిపోతానన్న భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఆయనకు అక్కడా ఓటమి తప్పదు. కేసీఆర్ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకే గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ కు వ్యతిరేకంగా వందలాది మంది నామినేషన్ వేశారు. కానీ చాలామందిని కేసీఆర్ బెదిరించి, నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారు” అని ఫైర్ అయ్యారు. ‘‘కామారెడ్డిలో కేసీఆర్ ను రక్షించడం కోసమే రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ రంగంలోకి దింపారు. అక్కడ బీజేపీ గెలవకుండా బీఆర్ఎస్ ను గెలిపించాలనేది రాహుల్ ఆలోచనగా ఉంది” అని ఆరోపించారు. బుధవారం బీజేపీ మీడియా సెంటర్ లో కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘కేసీఆర్.. చేతకాని ముఖ్యమంత్రి. ఆయన వల్ల ప్రజలకు రవ్వంత కూడా ఉపయోగం లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం తెలంగాణకు అరిష్టమే” అని కామెంట్ చేశారు. 

దరఖాస్తు చేయకుండానే మెడికల్ కాలేజీలు ఎట్లొస్తయ్? 

ఇంకో నెల రోజుల్లో పోయే కేసీఆర్.. ఇప్పుడు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ‘‘కేసీఆర్ చేతకానితనం వల్లే రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు రాలేదు. కాలేజీల కోసం కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోలేదు. ఫామ్ హౌస్ కే పరిమితమైండు. ఇప్పుడు వచ్చి మెడికల్ కాలేజీ అంటే ఎట్ల?” అని ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే మెడికల్ కాలేజీలపై తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రాజెక్టులకు కేసీఆర్ భూములు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చినంక, తామే కేంద్ర ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత టెక్స్ టైల్ పార్క్, సైన్స్ సిటీ, కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘సైన్స్ సిటీ అంటే ఈ మూర్ఖుడికి తెలుసా. తన ఫామ్ హౌస్ ను సైన్స్ సిటీ అనుకుంటున్నాడేమో” అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనని దరిద్రపు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మండిపడ్డారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ అడ్రస్ ఉండదు..  

ఇవి తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటేస్తే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని కిషన్ రెడ్డి అన్నారు. ఈ రెండు పార్టీలు కుటుంబ, అవినీతి పాలనను కొనసాగిస్తున్నాయని మండిపడ్డారు. ఈ పార్టీల వల్లనే తెలంగాణ ప్రజలకు బానిస బతుకు మిగిలిందని ఫైర్ అయ్యారు. ‘‘వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ అడ్రస్ కూడా ఉండదు. పార్లమెంట్ ఎన్నికల వరకు కారుకూతలు తప్ప.. కారు కనిపించదు” అని ఎద్దేవా చేశారు. ‘‘కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని కేసీఆర్ అంటున్నడు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం మారుతరని విమర్శలు చేస్తున్నడు. మరి ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే మూడు నెలలకో ప్రధాని మారరా?” అని ప్రశ్నించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ వెంట వచ్చే ఏకైక పార్టీ ఎంఐఎం మాత్రమేనని విమర్శించారు. ‘‘కేసీఆర్ ఎన్నో ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. ప్రత్యేక విమానాల్లో ఇక్కడికి పిలిపించుకుని దావత్ లు ఇచ్చారు. మరి వాళ్లలో ఒక్కరైనా కేసీఆర్ వెంట ఉన్నారా? బీఆర్‌‌ఎస్ సభల్లో కేసీఆర్ ఇస్తున్న స్పీచ్ లలో పస ఉండడం లేదు” అని అన్నారు. 

మేమొచ్చాక మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తం.. 

కాంగ్రెస్ ది మైనారిటీ డిక్లరేషన్ కాదని.. హిందూ, ముస్లింలను విభజించే డిక్లరేషన్ అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘పాతబస్తీలో పేద ముస్లింల భూములు లాక్కుంటున్నారు. ముస్లింల జోలికి వచ్చే గూండాలపై బుల్డోజర్లు దింపుతాం. పేద ముస్లింలకు అండగా నిలుస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తాం. ఆ నాలుగు శాతం రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలకు పంచుతాం” అని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ 23 మంది, కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే టికెట్లు ఇచ్చాయి. కానీ మేం 39 మంది బీసీలకు టికెట్లు ఇచ్చాం. బీజేపీ నుంచి 36 మంది, జనసేన నుంచి ముగ్గురు బీసీ అభ్యర్థులు ఉన్నారు. 14 మంది మహిళలకు, రెండు జనరల్ స్థానాల్లోనూ దళితులకు టికెట్లు ఇచ్చాం. కొన్ని రోజులుగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ హామీలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. తప్పకుండా అధికారంలోకి వస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తారని.. 18న గద్వాల, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి సభల్లో పాల్గొంటారని చెప్పారు.

ఢిల్లీ వెళ్లిన కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంటున్న దశలో  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్లడంపై బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బుధవారం మీడియా సమావేశంలో కిషన్ రెడ్డిని కొందరు విలేకరులు ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. తాను మూడు శాఖలకు కేంద్ర మంత్రినని, గత కొన్ని రోజులుగా ప్రచారంలో బిజీగా రాష్ట్రంలో ఉండటంతో ఫైళ్లన్ని పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. ఫైళ్లను క్లియర్ చేసేందుకే ఢిల్లీ వెళ్తున్నానని జవాబిచ్చారు. అయితే, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న సమయంలో కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. బీజేపీ అగ్ర నేతల నుంచి వచ్చిన పిలుపుతోనే ఆయన ఢిల్లీకి వెళ్లి ఉంటారనే చర్చ పార్టీ వర్గాలో సాగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న ఆదరణ, బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణపై ఆయా వర్గాల నుంచి  వస్తున్న రెస్పాన్స్ గురించి తెలుసుకోవడానికి అగ్రనేతలు ఢిల్లీకి పిలిపించి ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో కనీసం 20 సీట్లకు తగ్గకుండా బీజేపీ గెలవడం కోసం ఏం చేయాలనే దానిపై ఢిల్లీ పెద్దలు ఆయన నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారని పార్టీ వర్గాల్లో  చర్చ నడుస్తోంది. గురువారం సాయంత్రం తిరిగి కిషన్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు.