
హైదరాబాద్, వెలుగు : మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు దాఖలు చేసిన పరువు నష్టం కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని రామేశ్వరరావు వేసిన కేసులో హైదరాబాద్ మేజిస్ట్రేట్ కోర్టు కాగ్నిజెన్స్ ఉత్తర్వులను జారీ చేసింది. వీటిని కొట్టివేస్తూ శుక్రవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధానపరమైన లోపాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
పరువు నష్టం కేసును తిరిగి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు. రూ.కోట్ల విలువైన డీఎల్‌ఎఫ్ భూములు పలువురు చేతులు మారి చివరికి రామేశ్వరరావుకు చెందిన సంస్థల వశం అయ్యాయని రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. ఆధారాలు లేకుండా తమపై ఆరోపణలు చేశారని, తమ పరువుకు నష్టం చేకూరిందంటూ క్రిమినల్ పరువు నష్టం కేసును కింది కోర్టులో దాఖలు చేశారు. దీనిని మేజిస్ట్రేట్ కోర్టు కాగ్నిజెన్స్‌కు తీసుకోవడాన్ని రేవంత్‌రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. శుక్రవారం జరిగిన విచారణలో రేవంత్ తరఫు న్యాయవాది వాదిస్తూ, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా కింది కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. కారణాలు చెప్పకుండానే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు.
ప్రజల ఆస్తిని కాపాడాలనే లక్ష్యంతోనే ఒక ప్రజాప్రతినిధిగా భూ వ్యవహారంపై మాట్లాడారని చెప్పారు. విమర్శల వల్ల ఎవరికీ నష్టం చేకూరలేదని, ఆరోపణలు ఎవరికీ పరువు నష్టం కలిగించేవి కావని చెప్పారు. ప్రభుత్వం తరఫున అదనపు వీవీ రమణారావు ప్రతివాదన చేస్తూ, తాజాగా తిరిగి విచారణ చేపట్టేందుకు వీలుగా కేసును దిగువ కోర్టుకు రిమాండ్ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, మేజిస్ట్రేట్ కోర్టు గతంలో ఇచ్చిన కాగ్నిజెన్స్ ఉత్తర్వులను రద్దు చేసింది. తిరిగిప్రొసీడింగ్స్ చేపట్టేందుకు కేసును రిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.