రేపటి నుంచి మండలాల్లో కాంగ్రెస్ ప్రదర్శనలు

రేపటి నుంచి మండలాల్లో  కాంగ్రెస్ ప్రదర్శనలు

ధాన్యం కొనుగోళ్లు, రైతు సమస్యలపై రేపటి నుంచి రెండు రోజుల పాటు  అన్ని మండల కేంద్రాల్లో వినతిపత్రాలు, నిరసన ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటం ఉదృతం చేయాలన్నారు.  రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వినతి పత్రాలు అందజేయాలన్నారు. రైతులు ధాన్యం అమ్మకాల కోసం కల్లాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందన్నారు. దీంతో  కల్లాల వద్ద రైతులు అనారోగ్యాలతో, పాములు కరిచి మృత్యువాత పడుతున్నారన్నారు. పరిహారం కోసం రైతు కుటుంబాలు కోర్టు ముందు కన్నీళ్లు పెడుతున్నాయన్నారు.  67 వేల మందికి పరిహారం ఇచ్చామంటున్న సర్కారుకు 3,942 మంది భారమయ్యారా? అని రేవంత్  ప్రశ్నించారు.  కేసీఆర్ పాలనలో 67,699 మంది రైతులు అకాల మరణం చెందారని మంత్రి నిరంజన్ రెడ్డి అధికారికంగా ఒప్పుకున్నారన్నారు.  రైతు బీమా పథకం 59 ఏళ్ల వయస్సు లోపు వారికే వర్తింస్తుందని..  67 వేల పై మరణాలు సహజ మరణాలు కానట్టే కదా! అని అన్నారు.