సచ్చే ముందు పార్టీ మారేందుకు సిగ్గుండాలి.. సీనియర్ నేతలపై రేవంత్ ఫైర్

సచ్చే ముందు పార్టీ మారేందుకు సిగ్గుండాలి.. సీనియర్ నేతలపై రేవంత్ ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: 40 ఏండ్లు పదవులు అనుభవించి చచ్చే ముందు పార్టీ మారడానికి సిగ్గుండాలని పొన్నాల లక్ష్మయ్యపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పీసీసీ చీఫ్​గా ఉండి 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారని, రెండోసారి టికెట్ ఇస్తే 50 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారన్నారు. శుక్రవారం సీఈసీ భేటీ తర్వాత ఏఐసీసీ హెడ్ ఆఫీసులో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ‘పొన్నాల లక్ష్మయ్యను ఎవరైనా గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ దయ. ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలోకి పోవడానికి ఏం రోగం. 81 ఏళ్ల వయసులో పార్టీ మారడమే బుద్ధిలేని పని. ఇంకా కుర్చీ పట్టుకుని వేలాడి.. టికెట్ కావాలని తిరిగారు. డి.శ్రీనివాస్, కేశవ రావు, బొత్స సత్యనారాయణ వెళ్లారు. వెళ్లేవారు వెళ్తూనే ఉంటారు’ అని అన్నారు. పార్టీని దెబ్బతీయడానికి పార్టీని వీక్ చేయడానికి పొన్నాల ఈ నిర్ణయానికి వచ్చారన్నారు.

సగం మంది అభ్యర్థు ఎంపిక పూర్తి

పీడ దినాలు పోగానే మంచి ముహూర్తం చూసి అభ్యర్థులను ప్రకటిస్తామని రేవంత్ తెలిపారు. 50% సీట్లలో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని,  మిగతా 50% సీట్లపై అందరి సూచనలతో నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుందని, వచ్చే సునామీలో బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయన్నారు. రాష్ట్రంలో ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రలు ఉంటాయని చెప్పారు. 75 సీట్లకు పైగా కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో లక్షల మంది సమక్షంలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలపై కాంగ్రెస్ పార్టీ సంతకం చేస్తుందన్నారు.

బాత్రూంలు కడిగిన వ్యక్తికి పద్ధతులు ఏం తెలుసు 

సీట్లు అమ్ముకుంటున్నానని తనపై కేటీఆర్ చేసిన కామెంట్లకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అమెరికాలో బాత్రూంలు కడిగిన వ్యక్తికి కాంగ్రెస్ పద్ధతులు తెలియవని విమర్శలు గుప్పించారు. ‘రేవంత్ నిర్ణయంతో టికెట్లు ఖరారు కావు. ప్రక్రియ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తున్నారు. చిల్లరమల్లర ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు’ అని అన్నారు. బీసీలకు టీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పారు.

కేసీఆర్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నరు 

డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు, అధికారులు వేణుగోపాల్ రావు, నర్సింగరావు, భుజంగ రావులను కేసీఆర్​కు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టాస్క్‌‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, మరింత మంది ఎప్పుడో రిటైర్ అయ్యారన్నారు. ఇలాంటి అధికారులను ఎలక్షన్ కమిషన్ తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక శాఖ అధికారి రామకృష్ణారావు రూల్స్​కు విరుద్ధంగా కేసీఆర్ చెప్పిన వారికి నిధులు రిలీజ్ చేస్తున్నారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత అరవింద్ కుమార్ భూముల వినియోగ మార్పు చేశారని ఆరోపించారు. వీరిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని, కోర్టులను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్​కి మద్దతిచ్చే నాయకులపై కేంద్రం ఈడీ, సీబీఐలను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.