తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు ఎంతంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తులు ఎంతంటే..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాసేపట్లో కొలువుదీరనుంది. టీపీసీసీ చీఫ్ గా ఉండి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ నూతన  ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు 12 మంది మంత్రులు కూడా అదే వేదికపై ప్రమాణం చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట 4 నిమిషాలకు ఎల్బీ స్టేడియంలో ఈ వేడుక జరగనుంది. 

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆస్తులెంతా అనే వివరాలను తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  ఆయన నికర ఆస్తుల విలుల రూ.30 కోట్లుగా ఉందని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి అఫిడవిట్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఆయన వద్ద రూ.5,34,000 నగదు ఉంది. అలాగే రేవంత్, ఆయన భార్య గీతా రెడ్డి పేర్ల మీద కలిపి స్థిర , చర ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ రూ.30,95,52,652గా ఉందని ఆయన ప్రకటించారు.

రేవంత్ దంపతుల పేర్ల మీద రూ.1,30,19,901 మేర అప్పులు ఉన్నాయి. ఆయన వద్ద ఒక హోండా సిటీ, మరో మెర్సిడిస్ బెంజ్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి భార్య గీతా వద్ద రూ. 83,36,000 విలువైన 1,235 గ్రాముల బంగారం, వజ్రాల ఆభరణాలు.. రూ.7,17,800 విలువైన 9,700 గ్రాముల వెండి, వెండి వస్తువులు కూడా ఉన్నట్లు రేవంత్ రెడ్డి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. 

కాగా రేవంత్‌రెడ్డిపై మొత్తం 89 క్రిమినల్‌ కేసులు ఉండగా,ఆయన వద్ద రూ.2 లక్షల విలువ చేసే పిస్టల్, రూ.50 వేల విలువ చేసే రైఫిల్ ఉన్నట్లుగా తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.