- ఫ్యూచర్ సిటీని షూటింగ్‌లకు కేంద్రంగా మారుస్తం: రేవంత్ రెడ్డి
- కొత్త స్టూడియోల ఏర్పాటుకు సహకారం అందిస్తామని హామీ
- సీఎంతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖుల భేటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన అన్ని సౌలతులు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. స్క్రిప్టుతో వస్తే, సినిమా మొత్తం పూర్తి చేసుకుని వెళ్లేలా ఇండస్ట్రీని తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో భాగంగా మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీలో సినీ రంగానికి పెద్దపీట వేస్తామని తెలిపారు.
ఇక్కడ కొత్తగా స్టూడియోలు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ స్థాయిలో సినిమా షూటింగ్‌లకు, నిర్మాణానంతర కార్యక్రమాలకు ఫ్యూచర్ సిటీని ఒక కేంద్రంగా మార్చాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
సినిమా రంగానికి సంబంధించిన 24 క్రాఫ్ట్స్‌లో (విభాగాల్లో) ఇక్కడి స్థానికులకు శిక్షణనిచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దీని వల్ల ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభిస్తాయని, అదే సమయంలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, దిల్ రాజు, నటులు జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్, అక్కినేని అమల తదితరులు పాల్గొన్నారు.

