మోడీ, కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ వేద్దాం : రేవంత్ రెడ్డి

 మోడీ, కేసీఆర్ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ వేద్దాం : రేవంత్ రెడ్డి

దేశ సరిహద్దులు ఆక్రమణలకు గురవుతున్నా ప్రధాని నరేంద్రమోడీ స్పందించడం లేదని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. చైనా ఆక్రమణలను ప్రధాని పట్టించుకోవడం లేదన్నారు. దేశాన్ని కులం, మతం ఆధారంగా విడగొడుతున్నారని ఆరోపించారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కు కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. ప్రధానిగా అవకాశం వచ్చినా సోనియాగాంధీ తీసుకోలేదని, దేశానికి మంచి నాయకత్వం అందించారని చెప్పారు. యూపీఏ హయాంలోనే పేదలకు ఉపయోగపడే చాలా పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. ఎముకలు కొరికే చలిని లెక్కచేయకుండా రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేస్తున్నారని చెప్పారు. దేశంలో విచ్ఛిన్నకర శక్తులకు భయపడకుండా ప్రాణాలకు తెగించి యాత్ర చేస్తున్నారని అన్నారు. ప్రతి గడపను తట్టి రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ ప్రతిష్టను పెంచేలా సందేశాన్ని తీసుకెళ్ళాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు.\

ధరణితో లక్షలాది మంది రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఓటరు లిస్టులో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తే వాటిని తిరిగి చేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాల వైఫల్యాలపై ఛార్జిషీట్ విడుదల చేసి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. నిపుణుల సూచనలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. 2003లో ఎలాంటి విపత్కర పరిస్థితులను ప్రజలు ఎదుర్కొన్నారో 2023లో కూడా అలాంటి పరిస్థితులే రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. అందరం కలిసికట్టుగా కష్టపడితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.