కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం : రేవంత్ రెడ్డి

కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాం : రేవంత్ రెడ్డి

ఇది కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ
గళమెత్తుతున్న వారందరినీ ఆహ్వానిస్తం
ఇది తెలంగాణకు మేలు జరిగే కలయిక 
బీఆర్ఎస్ భూస్థాపితం కావడం పక్కా
2024లో రాహుల్ ను ప్రధానిని చేయడమే లక్ష్యం
ఇంటికి కిలో బంగారం ఇచ్చినా కేసీఆర్ గెలవడు
అమరుల ఆకాంక్షలు నెరవేరలే: జూపల్లి
ఉద్యమ సమయంలో రూ. లక్ష 2 లక్షల కోసం కార్లు, స్కూటర్లు అమ్మిండ్రు
ఆయనకు ఇప్పుడు 3 వేల కోట్లు ఎట్లా వచ్చాయ్
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కృష్ణారావు ఆగ్రహం

హైదరాబాద్ : కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నామని, ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనపై గళమెత్తుతున్న వారందరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్కాగా భూస్థాపితం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు. 

ముఖ్యంగా మైనార్టీలు, దళితులు, అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసానికి వెళ్లారు. అక్కడ కొడంగల్ కు చెందిన ముఖ్య నాయకుడు గుర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, మేగారెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో నియంతృత్వ పాలనను అంతమొందిస్తామని, ప్రజాగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాక తప్పదని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

రాష్ట్రంలో 15 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీ  లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని చెప్పారు. తాము కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన పెద్దలంతా సానుకూలంగా స్పందించారని అన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్  రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలు సాకారం కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి జూపల్లి తనకు చిరకాల మిత్రుడని ఆయనను, గుర్నాథ్ రెడ్డిని, దామోదర్ రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. 

నాలుగేండ్ల క్రితమే బయటికొచ్చాం

తాము నాలుగేండ్ల క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చామని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ కు తెలంగాణను పాలించే నైతిక హక్కులేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని, రాష్ట్రం అవినీతిలో అభివృద్ధి చెందిందని అన్నారు. కేసీఆర్ అనేక పథకాలు ప్రకటించి వాటిని అమల్లో పెట్టలేదని విమర్శించారు.  తెలంగాణలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖర్చులకు డబ్బుల్లేక కార్లు అమ్ముకున్న కేసీఆర్ కు మూడు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని జూపల్లి ప్రశ్నించారు. ఈ ఫాసిస్టు పాలనను వంద శాతం బొంద పెడ్తామని అన్నారు. 

పొంగులేటి ఇంటికి కాంగ్రెస్ 

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్ది ఇంటికి పీసీసీ చీప్​ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి తదితరులు వెళ్లారు. మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి కాంగ్రెస్ నాయకులు చేరుకోగా ఆయన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీలోకి రావాలని  రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి తదితరులు ఆహ్వానించారు.