
సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరదలొచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో రాజకీయ ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి క్లౌడ్ బరస్ట్ కామెంట్లు అత్యంత నిర్లక్ష్యమైనవన్న రేవంత్.. అవినీతిపై చర్చ జరగకుండా ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని అన్నారు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్చే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. ప్రవీణ్ రెడ్డి రాకతో హుస్నాబాద్ లో కాంగ్రెస్ మరింత బలోపేతమవుతుందని అన్నారు.
క్లౌడ్ బరస్ట్ ముందు విదేశాల కుట్ర అన్న కేసీఆర్ ఇప్పుడు పక్క రాష్ట్రాల కుట్ర అంటున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీకి వచ్చి కేంద్రానికి వరద నష్టం నివేదిక సమర్పించి రూ.2వేల కోట్ల నిధులు సాధించుకోవాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా ఇంత నష్టం జరిగినా కేంద్రం ఇప్పటి వరకు పరిశీలక బృందాలను రాష్ట్రానికి పంపలేదని రేవంత్ ఆరోపించారు. 21 నుంచి బీజేపీ రాష్ట్రంలో చేపట్టనున్న ర్యాలీలను ప్రజలు అడ్డుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలంటే బీజేపీ విలువలేదని, ఆ పార్టీని గెలిపిస్తే రాష్ట్రం మరింత ప్రమాదంలో పడుతుందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
పోలవరంపై కేసీఆర్, పువ్వాడ అజయ్ వ్యాఖ్యల్లో ఎవరి కామెంట్లు నమ్మాలని రేవంత్ ప్రశ్నించారు. ఆ ఆరోపణలు నిజమైతే ఇన్ని రోజులు ఎందుకు అభ్యంతరం లేవనెత్తలేదని అన్నారు. పోలవరాన్ని సాంకేతికంగా పరిశీలించాలన్న రేవంత్.. టీఆర్ఎస్ నేతలు సమస్యల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.