పేదల భూములు గుంజుకుంటున్న కేసీఆర్ సర్కారు

పేదల భూములు గుంజుకుంటున్న కేసీఆర్ సర్కారు

కేసీఆర్ హయాంలో కొత్త భూస్వాములు తయారవుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు కన్న బిడ్డల్లా చూసుకునే భూములను కేసీఆర్ సర్కారు అన్యాయంగా గుంజుకుంటోందని ఆరోపించారు. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను సైతం వివిధ కారణాలు చెప్పి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మండిపడ్డారు. తరతరాలుగా వస్తున్న భూముల్ని సర్కారే స్వయంగా లాక్కోవడం సిగ్గుచేటని రేవంత్ విమర్శించారు. ధరణి అద్భుతమని, సర్వరోగ నివారిణి అని కేసీఆర్ చెప్పిన మాటల్నీ అబద్దాలని ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతోందని అన్నారు. ధరణి రికార్డుల్లో అసలు యజమాని పేరు కాకుండా ఎవరెవరి పేర్లు ఉంటున్నాయని, లేదంటే సర్కారు భూమి అని చూపిస్తోందని వాపోయారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేస్తామని స్పష్టం చేశారు.

పేదలు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ 25లక్షల ఎకరాల భూములు పంచితే.. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 30 లక్షల ఎకరాలు మాయమయ్యాయని రేవంత్ ఆరోపించారు. ముఖ్యమంత్రి తీరుతో 5 లక్షల ఎకరాల పోడు భూములు కూడా ఆగమవుతున్నాయని అన్నారు. గౌరెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే చెల్లిందని విమర్శించారు. పేదల భూములు గుంజుకునేందుకే కేసీఆర్ను ప్రజలు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ఐటీ కంపెనీలు ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నాయో తెలియకపోయినా కేసీఆర్ సర్కారు మాత్రం అడ్డగోలుగా వాటికి భూములు కేటాయిస్తోందని రేవంత్ విమర్శించారు. ఎకరా రూ. 50కోట్లు పలికే 15 ఎకరాల భూమిని ఎలాంటి టెండర్లు లేకుండానే ఐకియాకు కట్టబెట్టారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు జాగా లేదంటున్న కేటీఆర్.. ఐకియాకు ఇచ్చిన భూమిలో వాటిన నిర్మించొచ్చు కదా అని రేవంత్ సూచించారు.