
తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య వంటి ఎందరో మహానుభావులు పోరాడారని... త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వైద్య, ఉపాధి రంగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం జరిగిందని అన్నారు. సమైక్య పాలనలో మనపై ఆధిపత్యం కొనసాగిందని.. సీమాంధ్ర నాయకుల మెడలు వంచి.. తెలంగాణ తెచ్చుకున్నామని, సమైక్య పాలనలో ఆ నాయకులకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని ఆయన అన్నారు.
2023, నవంబర్ 19వ తేదీ ఆదివారం హైదరాబాద్ సోమాజిగూడలో మీట్ ది ప్రెస్ కార్యమంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం జరగలేదన్నారు. కేసీఆర్.. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశారని.. పదేళ్లలో ప్రజలను బానిసలుగా చేసే పాలన జరిగిందని విమర్శించారు. నిజాం పాలనలో ఆకలిని భరించారు కానీ ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేదని... ఇన్నాళ్లు నిజాం తరహ పాలన కొనసాగిందని.. ఈ ఎన్నికలే తెలంగాణ చివరి దశ ఉద్యమం కావాలన్నారు రేవంత్ రెడ్డి. తుది దశ ప్రజా ఉద్యమంలో మీడియా పాత్ర కీలకం కావాలని కోరారు. కేసీఆర్ కుటంబం పెత్తనాన్ని ఇన్నీరోజులు ప్రజలు భరించారని... నాలుగు కోట్ల ప్రజల స్వేచ్ఛ కోసమే ఈ పోరాటం జరుగుతుందన్నారు.
నిజాం హయాం నుంచి భూమి కోసమే పోరాటాలు జరిగాయని చెప్పారు..ధరణితో భూ దోపిడీ జరిగిందని.. ధరణి అక్రమాల లెక్కలు తేలుస్తామని స్పష్టం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని అన్నారు. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో భూ దందాలు జరిగాయని ఆయన ఆరోపించారు. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఏ రోజు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇచ్చే పింఛన్ల కంటే కర్నాటకలో ఎక్కువ ఇస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ రూ.5వేల పింఛన్ ఇస్తామంటోందని... 9ఏళ్ల నుంచి పింఛన్ రూ.5వేలకు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ప్రాంతాలను భట్టీ ప్రాధాన్యతలు మారుతాయని ఆయన చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదర్కొందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణపై గతంలోనే బీజేపీ హామీ ఇచ్చిందని.. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ తెస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే.. 48 గంటల్లో ఆర్డినెన్స్ తేవొచ్చని.. కానీ, మాదిగల దృష్టి మరల్చేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.