- దమ్ముంటే రా కేసీఆర్..2029లో చూసుకుందాం!
- కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో
- కేసీఆర్‌ను ఉరేసినా పాపం లేదు
- కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉండడం తథ్యం
- చరిత్రను పునరావృతం చేస్తా
- రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లను గెలిచి
- రాహుల్‌ను ప్రధానిగా చేస్తాం
- దళితుడికి మంత్రి పదవి ఇస్తే జీవన్‌రెడ్డి ఓర్వలే
- అందుకే పాపాల భైరవుని పార్టీలో చేరిండు
- దొరలకు ఊడిగం చేసి గడీల ముందు
- బానిస బతుకు బతకడానికి పోయిండు’
- ఆనాడు ఎన్టీఆర్‌కు నమ్మక ద్రోహం చేశావ్..
- ఇప్పుడు 40 ఏళ్లు నీతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసినవ్
- నస్తూర్‌పల్లి బహిరంగ సభలో కేసీఆర్,
- జీవన్‌రెడ్డిపై సీఎం రేవంత్ ఫైర్
- రెండో విడత రైతుభరోసా కింద
- రూ.2,200 కోట్లు విడుదల
- ఇదే నా సవాల్: సీఎం రేవంత్
హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కాదు, కేసీఆర్‌కు ఉన్న ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటానని సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూర్‌పల్లి గ్రామంలో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.
బీఆర్ఎస్లో జీవన్‌రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్, జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ దీటుగా బదులిచ్చారు. 1994 నుంచి వరుసగా పదేండ్లు టీడీపీ, పదేండ్లు కాంగ్రెస్, పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని, ఇప్పుడు అదే చరిత్ర పునరావృతమవుతుందన్నారు. తాను, పీసీసీ చీఫ్ మహేశ్ నేతృత్వంలో 2034 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందన్నారు.
‘కేసీఆర్ దమ్ముంటే రా. 2023లో నిన్ను ఓడగొట్టిన. 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన. సర్పంచ్ ఎన్నికల్లో పాతరేసిన. మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పుపాతరేసిన. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్లో నీకు ఘోరీ కట్టిన.
వచ్చేసారి ఆ ఘోరీ మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తరు. ఇదే నా సవాల్’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో15 ఎంపీ సీట్లను గెలిచి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేసుకుంటామన్నారు. ఒక్క ఏడాది పదవి లేకపోతే తట్టుకోలేని జీవన్‌రెడ్డి పాపాల భైరవుని పార్టీలో చేరారని రేవంత్ ఆరోపించారు.
‘ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్‌ను మంత్రి చేస్తే చూసి ఓర్వలేనోనివి నువ్వు అసలు మనిషివేనా? ఇంత అసూయ, ఇంత ద్వేషం ఎవరికైనా ఉంటదా? ఇంతకాలం ముసుగు తొడుక్కోని బతికినవ్. ఇన్నాళ్లకు ఆ ముసుగు విడిపోయింది. కడుపు నిండా విషమే. విషమున్నోడు, విషమమున్నోడు ఇవాళ కడుపుల కత్తులు పెట్టుకోని కౌగిలించుకుంటున్రు(కేసీఆర్, జీవన్ రెడ్డిని ఉద్దేశించి). ఆయన ప్రభుత్వం వస్తదట.
ఈయనకు పెద్ద పదవస్తదట. చూస్కుందాం కేసీఆర్. నువ్వో, నేనో ఎన్నికలు ఎన్నడు వచ్చినా, ఒక్క మాట రాసిపెట్టుకోండి కేసీఆర్‌గారూ.. నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కనియ్య. నిన్ను పాతరేసే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటరు’ అంటూ ఫైర్ అయ్యారు.
కార్యకర్తల గుండెల మీద తన్నిండు..
ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్‌రెడ్డిపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రిని చేసిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నాదేండ్ల భాస్కర్ రావు పంచన చేరిన జీవన్ రెడ్డి ఇప్పుడు 40 ఏళ్ల పాటు ఆయనతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి పార్టీ మారిండని విమర్శించారు.
‘గడిచిన నలభై ఏళ్లలో 14 సార్లు పార్టీ బీ ఫారాలు ఇచ్చి పోటీ చేసే అవకాశం కల్పించినం. ఎమ్మెల్యేగా ఒడిపోతే ఎంపీ టికెట్ ఇచ్చినం. అయినా కేవలం ఒక ఏడాది పాటు పదవి లేకపోతే ఓర్చుకోలేవా? ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న భుజానా మోసిన్రు. 40 ఏండ్లు నీ కుటుంబం కోసం నువ్వు జడ్పీటీసీ, ఎంపీపీ టికెట్లు ఇచ్చిన వారికి ఊడిగం చేసిన్రు.
అలాంటి కార్యకర్తలను వదిలేసి బయటికి వెళ్లడం సమంజసమేనా? కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేరుతావా? దళితునికి మంత్రి పదవి ఇస్తే నీలో ఇంత అసూయ.. ద్వేషం ఉంటదా?’ అని నిలదీశారు. ఇట్లాంటోడు పెడితే పెళ్లి.. పెట్టకపోతే చావు కోరతాడని ఫైర్అయ్యారు. ‘జీవన్‌రెడ్డి దొరలకు ఊడిగం చేసి గడీల ముందు బానిస బతుకు బతకడానికి కేసీఆర్ పంచన చేరిండు’ అంటూ విరుచుకుపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో కేసీఆర్‌కు ఉరేసినా పాపం లేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిని చూస్తే తన కడుపు మండుతోందని, ఈ అవినీతి విషయంలో కేసీఆర్‌ను చెట్టుకు ఉరేసినా పాపం లేదని సీఎం రేవంత్అన్నారు. ‘ఇప్పుడే నేను మేడిగడ్డ బ్యారేజీ చూసి వస్తున్నా. ఇదే తప్పు నిజాం సర్కారులో జరిగితే కేసీఆర్ బట్టలూడదీసి కొట్టేవాళ్లం. కానీ తాము అధికారంలో ఉండడం వల్ల రాజ్యాంగం ప్రకారం నడుచుకొని సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చాం..’ అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రజాపాలన పోవాలని కోరుకోవడం ఏమిటని సీఎం ప్రశ్నించారు. ‘కరీంనగర్ జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు.. ఇద్దరికి విప్ పదవులు ఇచ్చినందుకు పోవాల్నా.. పేదోళ్ల ఇళ్లకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు పోవాల్నా.. రాష్ట్రంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నందుకు పోవాల్నా.. సన్నబియ్యం ఇచ్చి కడుపునిండా అన్నం పెట్టినందుకు పోవాల్నా.. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసినందుకు పోవాల్నా.. 70 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు పోవాల్నా’ అని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
రెండోవిడత రైతుభ రోసా కింద రూ. 2,200 కోట్లు విడుదల
కాగా, ఈ వేదిక మీదుగా రెండోవిడత రైతుభరోసా కింద రూ.2,200 కోట్ల నిధులను సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. గతంలో కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు తొలివిడుత రూ.3,500 కోట్లు వేశామని, సోమవారం మరో రూ. 2,200 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు. వచ్చే నెలలో రూ.3300 కోట్లు రైతు భరోసా డబ్బులు వేస్తామని సీఎం తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

