- దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ కానున్న రేవంత్, ఉత్తమ్
- ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లకు ఒప్పించేలా చర్చలు
- అన్ని సాంకేతిక నివేదికలు సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మరో కీలక అడుగు పడింది. మహారాష్ట్రతో మన ప్రభుత్వం మరో రౌండ్ చర్చలకు సిద్ధమైంది. ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. సోమవారం ముంబైలో జరగనున్న ఈ సీఎంల స్థాయి సమావేశానికి ఆదివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ముంబై బయల్దేరి వెళ్లనున్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశం నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయి టెక్నికల్ రిపోర్టులను సిద్ధం చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 148 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే తెలంగాణకు ఆశించిన ప్రయోజనం చేకూరదని ఇప్పటికే తేల్చారు. 148 మీటర్ల వద్ద ఎక్కువ నీటిని తీసుకుపోవడం కష్టం అవుతుందనే అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్రను ఒప్పించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ పొరుగు రాష్ట్రం ఒప్పుకోకపోతే కనీస ప్రత్యామ్నాయంగా 150 మీటర్ల స్థాయికైనా ఒప్పించే వ్యూహాన్ని అధికారులు సిద్ధం చేశారు.
సీడబ్ల్యూపీఆర్ఎస్ తేల్చిన లెక్క..‘జీరో విలేజ్ సబ్‌మెర్జెన్స్’
మహారాష్ట్ర ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది తమ భూభాగంలో ముంపు సమస్యపైనే. కానీ, పుణెకు చెందిన ప్రముఖ సంస్థ ‘సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్’ క్షేత్రస్థాయిలో నిర్వహించిన టెక్నికల్ స్టడీ రిపోర్టులను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టనుంది. బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించినప్పటికీ మహారాష్ట్ర పరిధిలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదని వివరించనుంది. 2,300 నుంచి 2,500 ఎకరాల అటవీ భూమి మాత్రమే ముంపునకు గురవుతుంది. అదే 150 మీటర్ల ఎత్తు పెడితే ముంపు విస్తీర్ణం 1,000 ఎకరాల లోపే పరిమితమవుతుంది. గతంలో అంగీకరించిన 148 మీటర్లకే దాదాపు 1,150 ఎకరాలు ముంపునకు గురవుతుండగా, 152 మీటర్లకు పెంచడం వల్ల వచ్చే అదనపు ముంపు చాలా స్వల్పమని సీడబ్ల్యూపీఆర్ఎస్ తన నివేదికలో స్పష్టం చేసింది.
