- కేంబ్రిడ్జ్ లోని గ్రీక్ రెస్టారెంట్ లో తొలి పరిచయం
- ఆయన అందం, సింప్లిసిటీ నన్ను బాగా ఆకట్టుకున్నాయి
న్యూఢిల్లీ: ఒక చిన్న రెస్టారెంట్‌లో మొదలైన పరిచయం.. లైఫ్ అంతా గుర్తుండిపోయే ప్రేమకథగా మారింది. కేంబ్రిడ్జ్‌లో రాజీవ్ గాంధీని తొలిసారి కలిసినప్పుడే ఆయనతో కలిసి జీవించాలనిపించిందని సోనియా గాంధీ వెల్లడించారు. తమ ప్రేమకు పునాది పడిన ఆ తొలి క్షణాలను పాత జ్ఞాపకాలు, ఫొటోలు తాజాగా ఆమె ‘ఎక్స్’లో షేర్ చేశారు. కేంబ్రిడ్జ్‌లోని ‘వర్సిటీ రెస్టారెంట్’లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా రాజీవ్‌తో పరిచయమైందని సోనియా చెప్పారు. అప్పట్లో ఇంగ్లండ్‌లో ఫుడ్ అంత బాగుండేది కాదని, రెస్టారెంట్లు కూడా తక్కువని గుర్తుచేసుకున్నారు. తనకు నచ్చిన ఫుడ్, ముఖ్యంగా ఇటాలియన్ వంటకాల కోసం వెతికేవారన్నారు. వివిధ దేశాల విద్యార్థులు కలుసుకునే ఆ రెస్టారెంట్‌లో జరిగిన పరిచయం తమ జీవితాలను మలుపు తిప్పుతుందని అనుకోలేదని తెలిపారు. రాజీవ్‌ను తొలిసారి చూడగానే ఆయనతో కలిసి జీవించాలనిపించిందని, ఆయనకూ తనపై అలాంటి భావనే కలిగిందని తర్వాత తెలిసిందన్నారు. రాజీవ్ చాలా అందంగా ఉండేవారని, ఆయనలోని సౌమ్యత్వం కూడా తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని వివరించారు.
అలా మొదలైన ఫ్రెండ్షిప్ క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పార్టీలకు వెళ్లడం, టూరిస్ట్ ప్లేసులు చూడటం వంటి అనుభవాలతో మరింత దగ్గరయ్యారు. తోటి స్టూడెంట్లతో కలిసి వాలెంటైన్స్ డే పార్టీల్లోనూ పాల్గొన్నారు. చివరకు 1968లో వివాహం చేసుకున్నారు. సోనియా తన పర్సనల్ లైఫ్ లోని అనుభవాలను ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో పంచుకోనున్నారు. నవంబర్ 10న ఈ పుస్తకం రిలీజ్ కానుంది. ఈ పుస్తకం ఆమె వ్యక్తిగత జీవితాన్ని, రాజీవ్‌తో ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరించనుంది. ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోలో.. ‘రాజీవ్, నేను ప్రేమ, నవ్వులు, జ్ఞాపకాలతో నిండిన ప్రపంచాన్ని నిర్మించుకున్నాం. నవంబర్ 10న ఆ ప్రపంచాన్ని మీతో పంచుకుంటా’ అని సోనియా పేర్కొన్నారు.
