అందరి చూపు ఆ ఆరుగురి పైనే…

అందరి చూపు ఆ ఆరుగురి పైనే…
  • అందరి చూపు ఉత్తమ్, రేవంత్, రేణుక, కోమటిరెడ్డి, పొన్నం, కొండాపైనే
  • గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్  రాజకీయాలపై పట్టు దొరికే చాన్స్
  • ఓడితే ఇక వారి పని అంతేననే అభిప్రాయం!
  • రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చలు
  • లోక్​సభ రిజల్ట్స్​ కోసం ఎదురుచూపు

సీనియర్ నేతలు రేణుకా చౌదరి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డిలకు మాత్రం ఫలితాలు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. రాష్ట్రంలో 4 నుంచి 6 సీట్లు సాధించడమనేది పార్టీకి తప్పనిసరని కాంగ్రెస్​ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని దెబ్బ తినడంతో కేడర్​ నిరాశలో ఉంది. లోక్​సభ ఎలక్షన్లలో అయినా సీనియర్లు గెలిస్తే.. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నిలబడగలదని అంటున్నారు.

గెలిచి తీరాల్సిన పరిస్థితి

పీసీసీ చీఫ్ ఉత్తమ్ నల్గొండ లోక్​సభ సీటు నుంచి బరిలోకి దిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని కాంగ్రెస్ పరాజయాన్ని చవిచూసింది. ఉత్తమ్​ హుజుర్ నగర్ నుంచి గెలిచినా.. ఆయన భార్య కోదాడలో ఓడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కేడర్లో జోష్ తీసుకురావాలంటే.. ఉత్తమ్​గెలవాల్సిందే. రాజకీయంగా కూడా ఆయనకు ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. పీసీసీ చీఫ్ పదవి వదులుకుని, జాతీయ రాజకీయాల వైపు వెళ్లాలని ఆయన ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీగా గెలవడం వ్యక్తిగతంగా ఆయనకు, రాజకీయంగా పార్టీకి అవసరం.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కొంత చరిష్మా ఉన్న నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి అనూహ్యంగా ఓడిపోయారు. అభిమానులు, పార్టీ కేడర్ దీనిని జీర్ణించుకోలేక పోయారు. ఏఐసీసీ చీఫ్ రాహుల్ సైతం రేవంత్​ ఓటమిపై విస్మయం చెందారని అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ కు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. కీలకమైన మల్కాజిగిరి లోక్​సభ టికెట్ ఇచ్చింది. రేవంత్ గెలిస్తే హైకమాండ్ వద్ద పరపతిని పెంచుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆయన పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారు. ఎంపీగా గెలిస్తే ఆ దిశగా కూడా సానుకూలత రావొచ్చన్న అభిప్రాయముంది. లేకుంటే రాష్ట్ర కాంగ్రెస్ లో ఆయన భవిష్యత్ కు దెబ్బపడినట్టేనని అంటున్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నేతల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకరు. భువనగిరి లోక్​సభ బరిలో నిలిచిన ఆయన పార్టీ సీనియర్లలో ఒకరు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వైఎస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. మరో సోదరుడు మోహన్​రెడ్డి కాంగ్రెస్ తరపున జడ్పీ చైర్​పర్సన్​ రేసులో ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిపై కన్నేసిన వెంకటరెడ్డి ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి ఓడిపోయారు. తాజాగా భువనగిరి లోక్​సభ బరిలో ఉన్నారు. ఇందులో గెలిస్తే ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న పీసీసీ చీఫ్​ పదవిని అందుకునేందుకు అవకాశం వస్తుందని, లేకుంటే పార్టీలో ఇబ్బందికర పరిస్థితి తప్పదని అభిప్రాయముంది.

రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచి, ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి.. ఈసారి ఖమ్మం నుంచి గెలుస్తారా, లేదా అన్నదానిపై ఆసక్తి నెలకొంది. పోరాడి చివరి నిమిషంలో ఖమ్మం టికెట్ దక్కించుకున్న ఆమె.. ఈసారి గెలిస్తే కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో ముద్ర వేసే అవకాశం దక్కనుంది. గతంలో కేంద్ర మంత్రిగా, ఏఐసీసీ స్థాయిలో ముఖ్యమైన పదవులు చేపట్టిన అనుభవం ఉండడం ఆమెకు కలసి వచ్చే అంశం. ఎంపీగా గెలవకపోతే ప్రాధాన్యతను కోల్పోకతప్పదన్న చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి తిరిగి చేవెళ్ల ఎంపీ స్థానాన్ని నిలబెట్టు కోవాల్సిన పరిస్థితి. రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన కొండా ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక నేతగా మారారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి వలస లు పెరిగిన సమయంలో.. రివర్స్​లో కాంగ్రెస్​లోకి వచ్చి నైతికంగా ధైర్యం ఇచ్చారు. సోనియా, రాహుల్ లకూ దగ్గరయ్యారు. కొండా ఈసారి గెలిస్తే జాతీయ స్థాయి కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక నేతగా మారుతారనే అభిప్రాయం వస్తోంది.

ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి తీరాల్సిన పరిస్థితిలో ఉన్న మరో నేత పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్. గతంలో ఎంపీగా ఓడిన ఆయన, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం పాలయ్యారు. తిరిగి కరీంనగర్ లోక్​సభ బరిలోకి దిగారు. రాష్ట్ర పార్టీలో, జిల్లా రాజకీయాల్లో పట్టు నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఆయన గెలుపు అనివార్యమని కాంగ్రెస్​ వర్గాలు చెబుతున్నాయి. లేదంటే ఆయన రాజకీయ భవిష్యత్ కు ఇబ్బంది తప్పదని అంటున్నాయి.