రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి

రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
  • గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి
  • భూమి సంవాద్‌‌‌‌ చర్చలో వక్తల అభిప్రాయం

హైదరాబాద్ : ప్రతి గ్రామంలో వందల్లో భూసమస్యలు ఉన్నాయని, ధరణికి ఎక్కకనో, ధరణిలో తప్పిదాల వల్లనో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వక్తలు అభిప్రాయపడ్డారు. భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చెప్పినట్లు మండల స్థాయిలో కాక గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లీఫ్స్‌‌‌‌, గ్రామీణ న్యాయ పీఠం ఆధ్వర్యంలో ధరణి సమస్యలు - దరిచేర్చే మార్గాలు అనే అంశంపై శుక్రవారం హైదరాబాద్ తార్నాకలోని లీఫ్స్ ఆఫీసులో భూమి సంవాద్‌‌‌‌ చర్చ నిర్వహించారు. భూచట్టాల నిపుణుడు, అడ్వొకేట్ భూమి సునీల్‌‌‌‌ అధ్యక్షతన జరిగిన చర్చలో టీజేఎస్ చీఫ్​ కోదండరాం, అఖిల భారత కిసాన్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమగ్ర సర్వేతోనే పరిష్కారం: కోదండరాం
భూమి హక్కుల చిక్కులు లేకుంటేనే ప్రజలైనా, ప్రభుత్వమైనా ప్రగతి బాటలో ముందుకెళుతుందని కోదండరాం అన్నారు. హక్కుల చిక్కులు తొలగాలంటే మంచి చట్టాలు, సమర్థవంతమైన భూపాలన, సత్వరం సమస్యలను పరిస్కారించే భూన్యాయ వ్యవస్థ ఉండాలని సూచించారు. ఇందుకు భూముల సమగ్ర సర్వేనే శాశ్వత పరిష్కారమన్నారు. సాదాబైనామాలు క్రమబద్ధీకరణ కాకపోవడం, నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములు, అసైన్డ్‌‌‌‌ భూమి సమస్యలు మొదలైన వాటికి పరిష్కారం దొరకడం లేదని కోదండరెడ్డి అన్నారు. ధరణి సమస్యలు తీరాలంటే వెంటనే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు. ఒక్కసారైనా చేతిరాత పహాణి రాయాలని, నిషేధిత జాబితాను గ్రామాల్లోనే సవరించాలని, సాదాబైనామా క్రమబద్దీకరణ కోసం చట్ట సవరణ చేయాలని లచ్చిరెడ్డి సూచించారు.