
కాపాడాల్సినోళ్లే.. కబ్జా చేస్తున్నరు!
5 కోట్ల ప్రభుత్వ భూమికి ఎసరు
రెవెన్యూ ఉద్యోగి భార్య పేరిట లావణి పట్టా
తోటి ఉద్యోగుల కంప్లైంట్తో విచారణకు ఆదేశించిన కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాపాడాల్సిన రెవెన్యూ అధికారే ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. గవర్నమెంట్ రూల్స్ ను గాలికొదిలేసి అడ్డదారులు తొక్కి రికార్డులను తిరగరాశారు. తోటి ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఈ అవినీతి బాగోతం బయటపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహారాష్ట్రకు అతి సమీపంలో ఉన్న గ్రామమిది. గోదావరి నదిపై వంతెన పడటం, నేషనల్ హైవే రోడ్డు వేయడంతో రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. రోడ్డుపక్కన ఉండే భూములైతే ఎకరానికి రూ. 2 కోట్లకు పైగా చెబుతున్నారు. కాళేశ్వరంలో ఎక్కువగా ప్రభుత్వ భూములే ఉన్నాయి. గ్రామంలోని 129 సర్వే నంబర్‌లో 380.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 60 ఎకరాలకు వరకు అటవీ శాఖ భూమి కూడా కలిసి ఉంది. ఈ భూమిలో కొంత భాగాన్ని ప్రభుత్వం గతంలో అసైన్ మెంట్‌చేసి పేదలకు పంచిపెట్టింది. మిగిలిన భూమిపై స్థానిక రెవెన్యూ అధికారి కన్ను పడింది.
4.18 ఎకరాలకు లావణి పట్టా
కాళేశ్వరంలో రూ.5 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమికి సంబంధించి మహాదేవ్ పూర్ మండల రెవెన్యూ అధికారులు అక్కడే పనిచేసే ఓ రెవెన్యూ ఉద్యోగి భార్య పేరిట పట్టాదారు పాస్‌బుక్‌జారీ చేశారు. 129 సర్వే నంబర్‌లో 100 బై నెంబర్ వేసి 185 ఖాతా నంబర్ ఇస్తూ లావణి పట్టా ఇచ్చారు. ఈ తంతంగం అంతా ఈ ఏడాది జనవరి నెలలోనే పూర్తి చేశారు. అయితే ఈ భూమిని విక్రయించడానికి ఆ ఉద్యోగి ప్రయత్నించడంతో విషయం బయటపడింది. ఎంతో విలువైన ప్రభుత్వ భూమిని తమ అనుమతి లేకుండా తమ దగ్గరే పనిచేసే రెవెన్యూ ఉద్యోగి కుటుంబసభ్యుల పేరిట బై నంబర్ ఇస్తూ పాస్‌బుక్‌జారీ చేయడంపై తోటి రెవెన్యూ ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతోపాటు మండలంలో జరుగుతున్న భూ బాగోతాలపై, రెవెన్యూ రికార్డుల మార్పులపై విచారణ జరపాల్సిందిగా కోరారు. దీంతో పూర్తి నిజానిజాలు తెలుసుకొని నివేదిక అందించాలని కలెక్టర్ అబ్దుల్ అజీం విచారణకు ఆదేశించారు.
ఇద్దరు ఉద్యోగులే చేశారా?
రైతులకు ఒక పట్టాదారు పాస్‌బుక్‌జారీ కావాలంటే గ్రామ వీఆర్వో, గిర్దావర్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ వెరిఫై చేసి ఆన్ లైన్‌లో సంతకాలు చేయాలి. లావణి పట్టా అయితే గతంలో ఉన్న అసైన్ మెంట్ రిజిస్టర్లను పరిశీలించి సరైనవని తేలితే ఈ అధికారులంతా సంతకం చేసి లావణి పట్టా పాస్‌బుక్‌జారీ చేయాలి. ఇదంతా కూడా ఆన్ లైన్ లోనే జరిగే ప్రక్రియ. కానీ కాళేశ్వరం గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఇచ్చిన లావణి పట్టావిషయంలో కేవలం ఇద్దరు ఉద్యోగుల పాత్ర మాత్రమే ఉన్నట్లుగా పలువురు పేర్కొటున్నారు. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి లావణి పట్టా ఇవ్వడం అనేది చట్ట వ్యతిరేకం. అయితే తహసీల్దార్ ఆఫీస్లో పనిచేసే తోటి ఉద్యోగులకు తెలియకుండా ఈ ఇద్దరు మాత్రమే ఆన్‌లైన్ లో సంతకాలు చేసి లావణి పట్టా జారీ చేసినట్లుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి.
పట్టా ఇచ్చింది నిజమే
కాళేశ్వరంలో ఓ రెవెన్యూ ఉద్యోగి కుటుంబసభ్యుల పేరిట లావణి పట్టా పాస్ బుక్ జారీ చేసిన మాట వాస్తవమే. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. ఈ భూ బాగోతంలో నా పాత్ర ఏమీ లేదు. ఆర్డీవో వచ్చి విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.
‑ శ్రీరాం మల్లయ్య, తహసీల్దార్, మహాదేవ్ పూర్ మండలం
For More News..