
- రెవెన్యూ సంఘాల ఏకీకరణపై వ్యతిరేకత
- కొన్ని సంఘాలను క్లోజ్ చేసే కుట్ర అంటున్న నేతలు
- కలిస్తే అస్తిత్వం కోల్పోతామని ఆందోళన
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన సంఘాలను ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్)లో విలీనం చేయాలనే ప్రతిపాదనపై ఆ శాఖలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలి బదిలీలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం పేరిట వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినపుడు కలిసిరాని ట్రెసాలో ఎలా కలుస్తామని తహసీల్దారులు, వీఆర్వోలు ప్రశ్నిస్తున్నారు. క్యాడర్ల వారీగా ఇండిపెండెంట్‌గా పనిచేసే తమ సంఘాలను ఏకీకరణ పేరిట నిర్వీర్యం చేసేందుకు కొందరు ప్రభుత్వ పెద్దలు కుట్ర చేస్తున్నారని తెలంగాణ తహసీల్దార్ల సంఘం(టీజీటీఏ), తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం ఆరోపిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు తహసీల్దార్లను వారున్న జిల్లాల నుంచి దూర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు. అలా ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిన వారిని తిరిగి పాత జిల్లాలకు పంపించాలని మూడు నెలలుగా సీసీఎల్‌ఏ, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎస్‌ను ట్రెసా, టీజీటీఏ ప్రతినిధులు పలుమార్లు కోరారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనకు పిలుపునిచ్చారు. చివరి నిమిషంలో ట్రెసా వెనక్కి తగ్గగా, తెలంగాణ తహసీల్దార్ల సంఘం మాత్రం జులై 9 నుంచి వర్క్ టూ రూల్ చేపట్టింది. ట్రెసా నిర్ణయంపై తహసీల్దార్లు నిరాశకు గురయ్యారు. మరోవైపు వర్క్ టూ రూల్4 రోజులకే నిలిచిపోయింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లే దీనికి కారణమని తెలిసింది.
అనంతరం వీఆర్వోల పనితీరుపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై తెలంగాణ వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా వారం రోజులపాటు నల్లబ్యాడ్జీలతో నిరసనకు పిలుపునిచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 2న కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు నిర్ణయించింది. వీఆర్వోల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా ముఖ్యమంత్రే అసెంబ్లీలో మాట్లాడినా ట్రెసా తరఫున ఎలాంటి ప్రకటన లేకపోవడం, వీఆర్వోల సంక్షేమ సంఘం చేసిన ఆందోళనకు ట్రెసా కనీస మద్దతు ప్రకటించకపోవడంపై ఆ సంఘం అసంతృప్తితో ఉంది. రెవెన్యూ ఉద్యోగులందరికి ప్రాతినిథ్యం వహించే సంఘంగా చెప్పుకునే ట్రెసా నాయకత్వం ఇలా తహసీల్దార్ల బదిలీలపై చేపట్టిన ఆందోళన సమయంలో, వీఆర్వోల ఉద్యోగ భద్రత, రెవెన్యూ శాఖపై సీఎం చేసిన వ్యాఖ్యల విషయంలో సైలెంట్‌గా ఉండి ఇప్పుడు కలిసి పోదామనే ప్రతిపాదన ముందుకు తేవడాన్ని ఆయా సంఘాల్లోని నేతలు తప్పుపడుతున్నారు. స్వతంత్రంగా వ్యవహరిస్తున్న సంఘాల మూసివేత కుట్ర ఉందని వీఆర్వోల సంఘం నేత అభిప్రాయపడుతున్నారు.
క్యాడర్ల వారీగా ఎవరి సమస్యలు వారికి ఉంటాయని, ఉమ్మడిగా సమస్యలపై పనిచేయాలనుకున్నప్పుడు గతంలోలాగే జేఏసీగా ఏర్పడి పనిచేయొచ్చని, ఏకీకరణ పేరిట ఒకే సంఘంగా ఏర్పడడం సాధ్యం కాకపోవచ్చని ఓ అధికారి వెల్లడించారు. ఏకీకరణ అంటే అన్ని సంఘాల కలయికతో కొత్త సంఘం ఏర్పాటవ్వాలని, అన్ని సంఘాలను మూసి మరో సంఘంలో చేరడం విలీనమే అవుతుందని వివరించారు.
చర్చలు జరుపుతున్నం
రెవెన్యూ సంఘాలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు ఇతర సంఘాలతో చర్చలు జరుపుతున్నాం. పది, పదిహేను రోజుల్లో కొలిక్కి రావొచ్చు. ఇది సంఘాల విలీనం కాదు.. ఏకీకరణ మాత్రమే. రెవెన్యూ సంఘాలన్ని కలిస్తే రాష్ట్రంలోనే అతి పెద్ద ఉద్యోగ సంఘం మాదే అవుతుంది. ఏకీకరణ తర్వాత రెవెన్యూ సమ్మేళనం నిర్వహిస్తాం. – వంగ రవీందర్‌రెడ్డి, ట్రెసా అధ్యక్షుడు