భూముల ధరలు సవరించాలి : పొంగులేటి

భూముల ధరలు సవరించాలి : పొంగులేటి
  •     ప్రజలపై ఆర్థిక భారం పడొద్దు: పొంగులేటి
  •     స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖపై మంత్రి రివ్యూ

హైదరాబాద్, వెలుగు : పేద, మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా, ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా సవరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై సెక్రటేరియెట్​లోని తన చాంబర్​లో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘బహిరంగ మార్కెట్‌‌ విలువలకు, మార్కెట్‌‌ ధరలకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా శాస్త్రీయ పద్ధతిలో భూముల ధరల సవరణ జరగాలి. ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువ వ్యత్యాసం ఉంది? అక్కడ హేతుబద్ధంగా ఎంత శాతం పెంచేందుకు అవకాశం ఉంది? తదితర అంశాలపై లోతైన అధ్యయనం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే.. ప్రభుత్వ ధర ఎక్కువ ఉంది. అక్కడ రేట్లు తగ్గించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి కసరత్తు చేయకుండానే భూముల ధరలు పెంచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రిపీట్ కావొద్దు.

స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్స్ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తం. అందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలి’’అని అన్నారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవాళ్లు గంటల తరబడి చెట్ల కింద వేచి చూసే పరిస్థితి లేకుండా.. రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక వసతులతో పర్మినెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఏర్పాటు చేస్తామన్నారు. పనితీరు ఆధారంగా పారదర్శకంగా బదలీలు చేపడ్తామన్నారు. రివ్యూ మీటింగ్​లో రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ జ్యోతి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.