ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు

అడ్డుకున్న బాధితులు
పోలీసు బందోబస్తుతో ఇండ్లను కూల్చేసిన రెవెన్యూ అధికారులు

జీడిమెట్ల, వెలుగు :  గాజుల రామారం పరిధిలోని  సర్వే నం.307, 329, 342 ప్రభుత్వ భూముల్లో  అక్రమంగా వెలసిన వందలాది నిర్మాణాలను భారీ బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు.  గతంలో ఇక్కడ జిల్లా కలెక్టర్ సర్వే చేయించగా.. ప్రభుత్వ భూమిని ఆక్రమించి 2 వేల అక్రమ ఇండ్లు నిర్మించుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ఉన్నతాధికారులు చర్యలు ప్రారంభించారు.  

ఇందులో భాగంగా శనివారం రెవెన్యూ అధికారులు పోలీసులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. వందలాది మంది రెవెన్యూ సిబ్బందితో కూల్చివేత పనులు చేపట్టారు. అయితే,  తమ ఇండ్లను కూల్చవద్దని పేదలు  జేసీబీలను, పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.  రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తు సాయంతో సర్వే నం. 307లోని బాలయ్యనగర్​, గాలిపోచమ్మ ఆలయం వద్ద , సర్వే నం.​ 329లో వాటర్ ​రిజర్వాయర్​ వద్ద, సర్వే నం. 342లోని మంజునగర్,  కైసర్​నగర్ మెయిన్​రోడ్​ను ఆనుకుని ఉన్న సుమారు 400 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

ఏండ్ల తరబడి ఈ ఏరియాలో కబ్జాదారులు స్థలాలను ఆక్రమించి పేదలకు అమ్మినట్లు తెలుస్తోంది. అయితే, ఇక్కడ 2 వేల ఇండ్లు నిర్మించే వరకు అధికారులు ఎందుకు స్పందించలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు.  ఇప్పుడు వచ్చి ఇండ్లను కూల్చివేస్తే తాము ఎక్కడ ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.