దళితుల భూమి గుంజుకున్నరు

దళితుల భూమి గుంజుకున్నరు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెల్క గ్రామంలో 19 ఏండ్ల కిందట ఎస్సీలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని రెవెన్యూ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసులు పెడతామని గ్రామస్తులను బెదిరించి, పోలీసుల బందోబస్తు మధ్య మంగళవారం ట్రెంచ్​ కొట్టారు. గోదావరి ఒడ్డున ఉన్న కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో వరదలు వచ్చినప్పుడల్లా చాలా ఇండ్లు మునిగిపోయేవి. దీంతో ప్రస్తుత బబ్బెరచెల్క పంచాయతీ పరిధిలోని 27, 28, 31, 549, 559 సర్వే నంబర్లలోని15  ఎకరాలను ఇండ్ల స్థలాల కోసం 323 కుటుంబాలకు కేటాయించారు. 2003 జూలై 10న అప్పటి మంచిర్యాల ఆర్డీఓ బీఎస్​వీవీఎస్​మూర్తి ప్రొసీడింగ్స్​ జారీ చేశారు. లాట్​సిస్టమ్​లో ప్లాట్లు కేటాయించి పట్టాలు అందజేయాలని కోటపల్లి తహసీల్దార్​ను ఆదేశించారు. తర్వాత అధికారులు పట్టించుకోకపోవడంతో ముంపు బాధితులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అప్పటినుంచి కేటాయించిన భూమి ఖాళీగానే ఉంది.  

ఎమ్మెల్యే ఆదేశాలతో స్వాధీనం... 

బబ్బెరచెల్క, దేవులవాడ గ్రామాల్లో ప్రభుత్వపరంగా చేపట్టే అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు ఇదే భూమిపై కన్నేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెన్నూర్​ఎమ్మెల్యే బాల్క సుమన్​ ఆదేశాలతో ఇప్పటికే శ్మశానవాటికలు, డంపింగ్​ యార్డులు నిర్మించారని ఆరోపిస్తున్నారు. ఇటీవల రెండు బృహత్​ప్రకృతి వనాలు, క్రీడా మైదానం ఏర్పాటు కోసం మిగిలిన 12 ఎకరాలను కేటాయించి చదును చేశారు. దీంతో ఈ స్థలంలో 2003లోనే ప్రభుత్వం తమకు ఇండ్ల స్థలాలు కేటాయించిందని, పట్టాలు ఇయ్యాలని గ్రామస్తులు పది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సర్వే చేసేందుకు వచ్చిన తహసీల్దార్​ను, రెవెన్యూ ఆఫీసర్లను అడ్డుకున్నారు. కొంతమంది కర్రలు పాతారు. ఆందోళనలో ముందున్న వ్యక్తులను మంగళవారం పోలీస్​స్టేషన్​కు పిలిపించారు. ఆందోళన చేస్తున్న చోట 100 మందికి పైగా పోలీసులను మోహరించారు. గ్రామస్తులు మళ్లీ నిరసనకు సిద్ధం కాగా కేసులు పెడతామని బెదిరించారు. పోలీసు బందోబస్తు మధ్య 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ట్రెంచ్ ​కొట్టారు.  ఈ విషయమై  కోటపల్లి తహసీల్దార్​ సునీల్​ దేశ్​పాండే మాట్లాడుతూ బబ్బెరచెల్కలో గతంలో ప్లాట్లు కేటాయించింది నిజమేనని, కానీ ఎవరికీ పట్టాలియ్యలేదన్నారు. 19 ఏండ్లుగా ఖాళీగా ఉండడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామస్తులకు పట్టాలియ్యాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవన్నారు.