సమగ్ర భూ సర్వే ..సర్వరోగ నివారిణి

సమగ్ర భూ సర్వే  ..సర్వరోగ నివారిణి

భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా జరిగిన ల్యాండ్ రికార్డ్ అప్డేట్ ప్రోగ్రాం (ఎల్​ఆర్​యూపీ) గొప్పగా చేశారని రెవెన్యూ సిబ్బందికి ఒకవైపు అభినందనలు తెలియజేసి, ఇంకోవైపు వారిని అవినీతిపరులు అనే ముద్రతో ఇతర శాఖలలో  సర్దుబాటు చేసి 2020లో  ధరణి పోర్టల్ ప్రారంభించడం జరిగింది.  భూ సమస్యలన్నింటికీ ధరణియే సర్వరోగ నివారిణి అని గొప్పలు చెప్పింది గత ప్రభుత్వం. భూ సమస్యల పరిష్కారానికికి 33 మాడ్యూల్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. కానీ, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా భూ సమస్యలు తయారయ్యాయి. లేఅవుట్లకు రైతుబంధు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు,  కోర్టులో మూలుగుతున్న సాదాబైనామా సమస్యలు, సివిల్ కోర్టులలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోయాయి.

  భూ చట్టాల న్యాయ నిపుణులు భూమి సునీల్ ఆధ్వర్యంలో లీఫ్ సంస్థ నిర్వహించిన భూ న్యాయ శిబిరాలలో ప్రతి గ్రామంలో 200 నుంచి 300 భూ సమస్యలు ఉన్నాయని నివేదికలు వెల్లడించాయి.  కేసీఆర్​ సర్కారు గొప్పగా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్ ఎందుకు ఈ సమస్యలన్నిటినీ తీర్చలేకపోయింది. రెవెన్యూ సదస్సులు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని పెడచెవిన పెట్టిన బీఆర్ఎస్​ ప్రభుత్వం మీద నమ్మకం లేకనే ప్రజలు అధికారానికి దూరంగా ఉంచారు. 

రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తం

రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వంలో విధులు నిర్వహించలేక నాలుగేండ్లు విధులకు దూరంగా ఉండి  ప్రభుత్వం మారగానే.. రైతులకు, రెవెన్యూ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందనే ఆశతో విధులలో మళ్ళీ జాయిన్ అయిన లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్, తహశీల్దార్ సంఘం అధ్యక్షుడే మార్పునకు సజీవ సాక్ష్యం. రెవెన్యూ సమస్యల మీద  మోగిన ధర్మగంట ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మూగబోయింది. కానీ, రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా భూ సమస్యలను ప్రస్తావించని  పత్రిక, టీవీ చానెల్ లేదు. ఎన్నికలలో  ధరణి  పోర్టల్ అధికార,  ప్రతిపక్షాలకు కూడా ప్రచార అస్త్రంగా మారింది. మేము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్​ను బంగాళాఖాతంలో కలుపు తామని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే  రైతుబంధుకు రామ్ రామ్,  ధరణి పోర్టల్ బంగాళాఖాతంలోకి, రైతులు హిందూ మహాముద్రంలో కలుస్తారని కేసీఆర్ చెప్పడం జరిగింది. తెలంగాణలో ప్రస్తుతం భూమి ఉన్న రైతులు ప్రశాంతంగా లేరు. ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. రెండు పర్యాయాలు అద్భుత పాలన అందించామని, శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగిందని దశాబ్ది ఉత్సవాలు చేసుకున్న బీఆర్ఎస్​ ప్రభుత్వ ఓటమికి ఈ ధరణి పోర్టల్ ఓ ముఖ్య కారణమని చెప్పవచ్చు.

ఓటుతోనే మార్పు సాధ్యం

పది సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో  విసిగిన ప్రజలు, ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రభుత్వ మార్పును  కోరుకున్నారు. ఇది ఓటుతో మాత్రమే సాధ్యమవుతుందని నిరూపించారు. ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వం మీద ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. భూ సమస్యలు లేని తెలంగాణ, ఆత్మగౌరవం, హక్కులు కోల్పోయిన రెవెన్యూ ఉద్యోగులు,  గత నాలుగు సంవత్సరాలుగా రెవెన్యూ మంత్రి ఎవరో కూడా తెలియని అధ్వాన స్థితిలో భూ పరిపాలన ప్రక్షాళన జరగాలి.  కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో వీఆర్వో, వీఆర్ఏల పునరుద్ధరణ జరగాలని,  సమగ్ర భూ సర్వేనే లక్ష్యంగా తొలి క్యాబినెట్ సమావేశంలో డిజిటల్ ల్యాండ్ సర్వేపై నిర్ణయం తీసుకోవాలని  తెలంగాణ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

- బందెల సురేందర్ రెడ్డి,  మాజీ సైనికుడు