పంట నష్టాన్ని పక్కన పెట్టి వచ్చే సీజన్​పై రివ్యూ

పంట నష్టాన్ని పక్కన పెట్టి వచ్చే సీజన్​పై రివ్యూ
  • పత్తి, కంది పంటలను ప్రోత్సహించాలె
  • కోటి 40 లక్షల ఎకరాల్లో సాగుకు రెడీ కావాలని ఆదేశం
  • వానాకాలంలోనే యాసంగికి నారుమడులు వదలాలని సూచన

హైదరాబాద్‌‌, వెలుగు: అకాల వర్షాలతో పంట నష్టపోయి, ధాన్యం తడిసి రైతులు కన్నీళ్లు పెడుతుంటే దాన్ని పక్కన పెట్టి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి వచ్చే సీజన్‌‌ పంటలపై సమీక్ష నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులు, వడగండ్లతో చెడగొట్టు వానలు కురస్తున్నయి. యాసంగి పంటలు ఆగమైతున్నయి. మార్చి 17 నుంచి 22 తేదీ వరకు అదే విధంగా ఏప్రిల్‌‌ నెలలో రెండు వారాల పాటు వరుసగా వానలు పడ్డాయి. రాష్ట్రంలో యాసంగి పంటలు 12 లక్షల ఎకరాలకు పైగా పంటలు అకాల వర్షాల బారినపడి దెబ్బతిన్నాయి. నిత్యం కురుస్తున్న వానలతో రైతులు పంటలు నష్టపోతుండగా, పండిన పంట నీటిపాలవుతోంది. ఇంత జరుగుతున్నా.. పట్టించుకోకుండా వచ్చే సీజన్​కు ఏవిధంగా ఏర్పాట్లు చేయాలనే దానిపై సమీక్ష నిర్వహించారు.

14 లక్షల ఎకరాల్లో ఉద్యానపంటలు

సోమవారం కొత్త సెక్రటేరియెట్‌‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి వచ్చే వానాకాలం పంట ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. వచ్చే సీజన్‌‌లో కోటి 40 లక్షల ఎకరాలలో, మరో 14 లక్షల ఎకరాలలో ఉద్యాన పంటలు వేయాలని టార్గెట్‌‌ పెట్టారు. దానికి అనుగుణంగా అధికారులు సమాయత్తం కావాలని ఆదేశించారు. పత్తి, కంది సాగును మరింత ప్రోత్సహించాలని, 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు రెడీ చేయాలని ఆదేశించారు. వానాకాలంలోనే యాసంగి వరిసాగు నారుమడులకు అవసరమయ్యే పొలం వదులుకోవాలని సూచించారు. అప్పుడే మార్చి నాటికి యాసంగి కోతలు పూర్తయి వడగండ్ల వానల నుంచి నష్టాన్ని నివారించవచ్చని సూచించారు. నేరుగా విత్తనాలు వేసే పద్ధతులను ప్రోత్సహించాలని దీంతో వరి సాగులో 10 నుంచి 15 రోజుల వరకు సమయం ఆదా అవుతుందని తెలిపారు. బాన్సువాడ, బోధన్, హుజూర్​నగర్, మిర్యాలగూడ మాదిరిగా వరి సాగు సీజన్ ముందుకు జరపాలని సూచించారు. రైతులకు ఇచ్చే సాంకేతిక సూచనలు, సమాచారం సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

రైతువేదికలలో నిరంతర సమావేశాల ద్వారా సాగు విస్తరణలో రైతులను విరివిగా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. నకిలీ విత్తన పంపిణీదారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, అగ్రికల్చర్‌‌ సెక్రటరీ రఘునందన్ రావు, కార్పొరేషన్ల చైర్మన్లు గంగారెడ్డి, రవీందర్ రావు, మచ్చా శ్రీనివాస్ రావు, హార్టికల్చర్‌‌ డైరెక్టర్ హన్మంతరావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, రాములు, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.