- భూముల వ్యాల్యూ పెంపు
- వ్యవసాయ భూములు కనిష్టంగా ఎకరాకు 2.75లక్షలు
- క్యూర్ పరిధిలో ఎకరం 15లక్షలు
- ఖాజాగూడలో గరిష్టంగా ఎకరం విలువ రూ.30 కోట్లు
- క్యూర్ పరిధిలో రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్ల కనీస మార్కెట్.. చదరపు గజం 3 వేలు
- గచ్చిబౌలి ఏరియాలో ఓపెన్ ప్లాట్ గరిష్టంగా గజం78వేలు
- కమర్షియల్‌లో మ్యాగ్జిమం గజం 1.15లక్షలు
- అపార్ట్‌మెంట్ విలువల్లో స్వల్ప మార్పులు
- పెరిగిన మార్కెట్ రేట్లు రేపటి నుంచే అమల్లోకి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియ పూర్తయింది. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా సవరించిన కొత్త మార్కెట్ విలువలను ఈ నెల 5 నుంచి ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్నది. ప్రాంతాలవారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించి.. ఈ కొత్త విలువలను ఖరారు చేసింది. కొత్త ధరల ప్రకారం రాష్ట్రంలో వ్యవసాయ భూముల కనీస ధరను ఎకరాకు రూ. 2.75 లక్షలుగా నిర్ణయించారు. అదే సమయంలో క్యూర్ ఏరియా పరిధిలోకి వచ్చే వ్యవసాయ భూముల ఎకరా కనీస ధర రూ. 15 లక్షలుగా ఖరారు చేశారు. ఇక రాష్ట్రంలోనే అత్యంత గరిష్ట మార్కెట్ వాల్యూ విషయానికి వస్తే.. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలో గతంలో ఎకరాకు రూ. 24 కోట్లు ఉండగా, ఇప్పుడు దానిని రూ. 30 కోట్లకు పెంచారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఇంతకు మించి మార్కెట్ వ్యాల్యూ ఉన్న ప్రాంతాల్లో మాత్రం పాత ధరలనే కొనసాగించనున్నారు. బుధవారం కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అదనపు పనివేళలను కొనసాగించనున్నట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రకటించింది.
ఓపెన్ ప్లాట్ల కనీస ధరలు ఇలా..
ఓపెన్ ప్లాట్ల కనీస ధరలను చదరపు గజం (స్క్వేర్ యార్డ్) లెక్కన ప్రాంతాలవారీగా వర్గీకరించారు. గ్రామీణ (రూరల్) ప్రాంతాల్లో చదరపు గజం కనీస ధర రూ. 600 చొప్పున ఖరారు చేయగా, మున్సిపాలిటీల్లో రూ. వెయ్యి, మున్సిపల్ కార్పొరేషన్లలో రూ. 1,500గా నిర్ణయించారు. ఇక హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్ కనీస ధర చదరపు గజానికి రూ. 2వేలుగా ఉంటుంది.క్యూర్ పరిధిలోని రెసిడెన్షియల్ ఏరియాలలో ఓపెన్ ప్లాట్ల కనీస మార్కెట్ విలువ చదరపు గజానికి రూ. 3వేలు ఉండగా.. గరిష్టంగా గచ్చిబౌలి ఏరియాలో రూ. 78 వేలకు చేరింది. ఇదే గచ్చిబౌలి కమర్షియల్ ఏరియాలో గరిష్ట ధరను చదరపు గజానికి రూ. 1.15 లక్షలుగా నిర్ణయించారు.
అంటే గచ్చిబౌలి కమర్షియల్ ఏరియాలో కేవలం 100 గజాల ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయాలన్నా ప్రభుత్వ మార్కెట్ విలువే రూ. 1 కోటి 15 లక్షలుగా ఉంటుంది. మరోవైపు అపార్ట్‌మెంట్ (ఫ్లాట్ల) విషయానికి వస్తే.. క్యూర్ ఏరియాలో చదరపు అడుగు (స్క్వేర్ ఫీట్) కనీస ధర రూ. 2వేలుగా ఖరారు చేశారు. ఇక్కడ గరిష్టంగా ఉన్న రూ. 6,600 ధరలో ఎలాంటి మార్పు చేయకుండా, పాత ధరను అలాగే కొనసాగించనున్నారు.
వ్యవసాయ, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల ధరల పెంపు శాతం ఇలా..
కొత్త మార్కెట్ సవరణల ప్రకారం వ్యవసాయ భూములకు 50 శాతం మేర ఎక్కువ పెంచుతుండగా, గరిష్టంగా 100 శాతం మేర పెంపు ఉండనుంది. ఓపెన్ ప్లాట్లకు 50 శాతం నుంచి 100 శాతం వరకు, అలాగే అపార్ట్మెంట్లకు గరిష్టంగా 20 శాతం మేర ధరలు పెరగనున్నాయి. ఫ్లాట్ల విషయంలో గతంలో ఉన్న అంతస్తుల వారీ అసమానతలను తొలగించి, అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తింపజేస్తూ హేతుబద్ధీకరించారు. ఇప్పటికే విపరీతమైన మార్కెట్ విలువలు ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి పెంపును ప్రతిపాదించలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మార్కెట్ విలువకు, బహిరంగ మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని (గ్యాప్) బట్టి ఈ పెంపు అమలుచేశారు. ప్రస్తుతం ఉన్న విలువకు, వాస్తవ ధరకు మధ్య 0% నుంచి 20% వరకు గ్యాప్ ఉంటే ఎలాంటి పెంపు లేదు. అలాగే 20% పైబడి 50% వరకు గ్యాప్ ఉంటే 15 శాతం, 50% పైబడి 100% వరకు గ్యాప్ ఉంటే 25 శాతం, 100% పైబడి 200% వరకు గ్యాప్ ఉంటే 50 శాతం మేర మార్కెట్ విలువను పెంచనున్నారు. ఇక 200% పైబడి 500% వరకు గ్యాప్ ఉన్న చోట 75 శాతం, 500% కంటే ఎక్కువ గ్యాప్ ఉన్న ప్రాంతాల్లో గరిష్టంగా 100 శాతం మేర మార్కెట్ విలువను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణ రంగంలో (కన్‌స్ట్రక్షన్ వాల్యూ) ఇండ్లు, అపార్టెమెంట్ ఫ్లాట్ల విలువల్లో 2021 తర్వాత ఎలాంటి సవరణలు జరగలేదు. గత ఐదేండ్లలో నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఆర్సీసీ, నాన్-ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించారు. అనేక గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం వల్ల ఈ మార్పులు చేశారు.
గత ప్రభుత్వ అశాస్త్రీయ విధానాలను సరిదిద్దాం: మంత్రి పొంగులేటి
ఆర్థిక నిపుణుడు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక, ఉన్నతాధికారుల సూచనలను పరిగణనలోకి తీసుకుని విస్తృతస్థాయిలో అధ్యయనం నిర్వహించిన అనంతరం మార్కెట్ వాల్యూ సవరణ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా, అశాస్త్రీయ పద్ధతుల్లో 2021–22 సంవత్సరాల్లో కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల విలువలను పెంచడంతోపాటు రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణనల ఆధారంగా, పట్టికల ప్రకారం చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యాయయన్నారు. వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల భూ లావాదేవీల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (ఎస్‌ఆర్‌ఓలు) పరిధిలో మార్కెట్ విలువల పునరుద్ధరణ చేపట్టామని మంత్రి వెల్లడించారు.
గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు స్థానిక పరిస్థితులను పరిశీలించి సవరించిన విలువలను రూపొందించి ఆమోదించాయని చెప్పారు. ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్), రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్), పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్కెట్ విలువలను సరిదిద్దినట్టు మంత్రి తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ వ్యాల్యూకు తగ్గట్టుగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ ప్రక్రియ చేపట్టినట్టు మంత్రి వివరించారు.
