
- నిర్మల్ జిల్లాలో శిథిలావస్థకు చేరి వృథాగా మారిన లిఫ్ట్ స్కీమ్ లు
- నిర్వహణ పట్టించుకోని, నిధులివ్వని గత సర్కార్
- మరమ్మతులు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ఆదేశాలు
- రూ.120 కోట్లతో ప్రపోజల్స్ రూపొందించి పంపిన అధికారులు
నిర్మల్, వెలుగు : శిథిలావస్థకు చేరి వృథాగా మారిన ఎత్తిపోతల పథకాలకు పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఆదేశించగా.. నిర్మల్ జిల్లాలో 40 లిఫ్ట్ స్కీమ్ ల పునరుద్ధరణకు సంబంధిత అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎప్పటికప్పుడు రిపేర్లు చేయకపోవడం, నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడంతో ఎత్తిపోతలపై రైతులు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.
దీంతో రూ. కోట్లు ఖర్చుపెట్టి నిర్మించినవన్నీ నిరుపయోగంగా మారాయి. జిల్లాలో మొత్తం 42 ఎత్తిపోతల పథకాలను నిర్మించగా.. ప్రస్తుతం రెండు మాత్రమే పని చేస్తున్నాయి. ఇవన్నీ కలిపి50 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేవి. కాగా.. ప్రస్తుతం రెండు మూడు వేల ఎకరాలకు మాత్రమే నీరు అందించే పరిస్థితి నెలకొంది. 40 ఎత్తిపోతల పథకాలకు ఇరిగేషన్, ఐడీసీ అధికారులు రూ. 120 కోట్లతో ప్రపోజల్స్ పంపించారు. వీటిని పునరుద్ధరించి, 50 వేల ఎకరాలతో పాటు అదనంగా మరో 25 వేల ఎకరాలకు నీరందించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
రూ. 80 కోట్ల లిఫ్ట్ స్కీమ్ ఏడేండ్లుగా వృథాగా..
ఇప్పటివరకు బ్రహ్మంగావ్ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి రూ.80 కోట్ల ఖర్చు చేసినా పంటలకు చుక్కనీరు అందించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీని పనులు 2013లో ప్రారంభించగా 2018లో పూర్తయ్యాయి. 6 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే.. గత ఏడేండ్ల నుంచి ఎత్తిపోతల స్కీమ్ పని చేయడం లేదు. ఊరికి దూరంగా లిఫ్ట్ ఉండడంతో యంత్ర పరికరాలు, ట్రాన్స్ ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు.
ప్రభుత్వం మళ్లీ లిఫ్ట్ స్కీమ్ ను ప్రారంభించాలని ఆదేశించగా కొద్దిరోజుల కింద రూ. 6 కోట్లతో కొత్త ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం రూ. 5. 88 కోట్లను మంజూరు చేసింది. ఆ నిధులతో పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి, ఆయకట్టు సాగు లక్ష్యానికి అనుగుణంగా నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు.
రెండు సెగ్మెంట్లలోని లిఫ్ట్ లకు ప్రతిపాదనలు
నిర్మల్ సెగ్మెంట్ లోని బన్సపెల్లి, దిలావర్ పూర్, న్యూలోలం లిఫ్ట్ స్కీమ్ లకు కలిపి ఒక ప్యాకేజీగా అంచనాలు తయారు చేశారు. రూ. 73 కోట్లతో మరమ్మతులకు అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. కంజర ఎత్తిపోతల కు రూ. 2 కోట్లు, సమందర్ పల్లి ఎత్తిపోతలకు రూ. 5 కోట్లు, టింబరే ని ఎత్తిపోతలకు రూ. 5 కోట్లు, నరసాపూర్ జి ఎత్తిపోతలకు రూ. 2 కోట్లతో మరమ్మతు పనులకు ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వానికి పంపించారు.
ముథోల్ సెగ్మెంట్ లోని మన్మథ్ఎత్తిపోతలకు రూ. 3 కోట్లు, పంచగుడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు రూ. 80 లక్షలు, ఆష్టా ఎత్తిపోతల కు రూ. 3 కోట్లు, కౌట ఎత్తిపోతలకు రూ. 3 కోట్లు, బ్రహ్మంగావ్ ఎత్తిపోతల రూ. 6 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.