- పాత ల్యాప్‌టాప్‌లతోనే నడిపిస్తున్న వర్సిటీ
- ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్న మెరిట్ స్టూడెంట్లు
- ప్రతిపాదనలు పంపినా.. అనుమతులు రాలేదంటున్న వర్సిటీ అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మెరిట్ విద్యార్థులకు నిలయమైన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ – బాసర)లో విద్యార్థులకు టెక్నికల్ ఎడ్యుకేషన్ సరిగా అందడం లేదు. వర్సిటీలో అడుగు పెట్టగానే స్టూడెంట్లకు అందాల్సిన ల్యాప్ టాప్లు.. మూడు, నాలుగేండ్లు చదివినా అందడం లేదు. ఇంజినీరింగ్ లో అడుగు పెట్టిన విద్యార్థులకూ పాత ల్యాప్‌టాప్‌లతోనే మమా అనిపిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పీయూసీ నుంచే బంద్
పదో తరగతిలో వచ్చే మెరిట్ ఆధారంగా ఏటా 1500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ద్వారా ఆర్జీయూకేటీలో అడ్మిషన్లు ఇస్తుంటారు. గ్రామీణ ప్రాంత పేద మెరిట్ పిల్లలకు టెక్నికల్ విద్యను అందించడమే వర్సిటీ లక్ష్యంగా ఉంది. కానీ, ఆ లక్ష్యం ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. గతంలో బాసర ట్రిపుల్ ఐటీలో అడుగుపెట్టిన ప్రతి స్టూడెంట్కు పీయూసీ (ఇంటర్) ఫస్టియర్ లోనే ప్రభుత్వం ల్యాప్ టాప్ లను అందజేసేది. దీంతో విద్యార్థులకు మొదటి నుంచే కోడింగ్, డిజిటల్ లెర్నింగ్ పై పట్టు వచ్చేది. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఈ వర్సిటీని విస్మరించి, నిధులు కేటాయించడం మానేసింది.
దీంతో రెండేండ్ల పీయూసీ పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ ఫస్టియర్ (ఈ1)లో ల్యాప్ టాప్ లను ఇవ్వాలని వర్సిటీ అధికారులు నిర్ణయించుకున్నారు. కనీసం ఈ నిర్ణయం కూడా వర్సిటీలో సక్రమంగా అమలు చేయడం లేదు. ఈ ఏడాది ఈ1 విద్యార్థులకు ఇప్పటికీ ల్యాప్ టాప్ లను అందివ్వలేదు. దీంతో క్లాసురూముల్లోని అరకొర కంప్యూటర్ల పైనే వీరు ఆధారపడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంజినీరింగ్ వారికీ పాతవే గతి..
ప్రస్తుతం సెకండియర్, థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు కొత్త ల్యాప్‌టాప్‌లు అందలేదు. ఔట్ గోయింగ్ విద్యార్థుల నుంచి సేకరించిన పాత ల్యాప్ టాప్లనే వారికి అందించినట్టు విద్యార్థులు చెప్తున్నారు. అయితే, ఇవి సరిగా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాటరీ టైమింగ్ లేక, సాఫ్ట్ వేర్ అప్ డేట్ కాక అవస్థలు పడుతున్నట్టు చెప్తున్నారు. అయితే, ఈ4 విద్యార్థులకు మాత్రం గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త ల్యాప్ టాప్ లను ఇచ్చినట్టు పేర్కొంటున్నారు. ల్యాప్ టాప్ ల కొనుగోలుకు సంబంధించి నిధుల కొరత వేధిస్తోందని ఆర్జీయూకేటీ అధికారులు చెప్తున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాలేదంటున్నారు. ఒక టెక్నికల్ యూనివర్సిటీలో విద్యార్థులకు కనీస అవసరమైన ల్యాప్ టాప్ లను సమకూర్చలేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. విద్యార్థులకు కొత్త ల్యాప్ టాప్లు పంపిణీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
