13 రోజుల్లో ఎఫ్​సీఐకి బియ్యం ఇవ్వాల్సిందే : డీఎస్ చౌహాన్

13 రోజుల్లో ఎఫ్​సీఐకి బియ్యం ఇవ్వాల్సిందే :  డీఎస్ చౌహాన్
  • లేదంటే మిల్లర్లకు 25% పెనాల్టీ: సివిల్​ సప్లైస్ కమిషనర్ చౌహాన్
  • కార్పొరేషన్ ​డంపింగ్​ యార్డ్ కాదు
  • ఇకపై పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని హెచ్చరిక
  • అవసరానికి మించి గన్నీ బ్యాగుల సేకరణపై ఎంక్వైరీకి ఆదేశం
  • అడిషనల్ కలెక్టర్లు, డీసీఎస్​వోలు, డీఎంలతో రివ్యూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  ఈ నెల 31వ తేదీలోగా మిల్లర్లు ఎఫ్​సీఐకి మొత్తం కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వాలని సివిల్‌‌‌‌ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఆదేశించారు. ఆలస్యం చేస్తామంటే కుదరదని, డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి 25 శాతం పెనాల్టీ వసూలు చేస్తామని హెచ్చరించారు. మిల్లర్లు ప్రతీసారి డిఫాల్ట్ కావడం.. గడవు తర్వాత సివిల్​సప్లైస్ కార్పొరేషన్​కు బియ్యం ఇవ్వడం ఇకపై కుదరదని తేల్చిచెప్పారు. కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాత పద్ధతులను పక్కన పెట్టాలని చెప్పారు. గురువారం ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌‌‌ ఆర్డీలో సీఎంఆర్, డిఫాల్ట్ మిల్లర్ల నుంచి పెనాల్టీ వసూలు, పీడీఎస్ బియ్యం నాణ్యత, పాత గన్నీ సంచుల సేకరణ తదితర అంశాలపై అడిషనల్ కలెక్టర్లు, డీసీఎస్‌‌‌‌వోలు, డీఎంలతో కమిషనర్‌‌‌‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా చౌహాన్‌‌‌‌ మాట్లాడుతూ.. ఈ నెల 31వ తేదీలోగా నిరుడు వానాకాలం సీజన్‌‌‌‌కు సంబంధించిన మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో బియ్యం సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎఫ్‌‌‌‌సీఐకి బియ్యం అప్పగించడానికి ఇంకో 13 రోజుల టైమ్ మాత్రమే ఉందనీ ఆఫీసర్లందరు సమన్వయంతో పనిచేసి టార్గెట్ సాధించాలన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎఫ్ సీఐకి బియ్యం ఇవ్వకుండా డిఫాల్ట్ అయి.. గడువు తర్వాత పాత పద్ధతిలో సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ సంస్థకు బియ్యం ఇస్తామంటే కుదరదని చెప్పారు. ఎట్టిపరిస్థితులోనూ దీనికి అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రజాపంపిణీకి అవసరమైన బియ్యం నిల్వలు కార్పొరేషన్ దగ్గర ఉన్నాయని, ప్రతి బియ్యం గింజను ఎఫ్‌‌‌‌సీఐకి అప్పగించాలన్నారు. 

కెపాసిటీకి తగ్గట్టు మిల్లింగ్​జరగట్లేదు

డిఫాల్ట్ అయిన మిలర్ల నుంచి 25శాతం పెనాల్టీ వసూలు చేస్తామని ఈ విషయంలో ఎవరికి మినహాయింపులు ఉండవని చౌహాన్ అన్నారు. బియ్యం సేకరణ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, సివిల్‌‌‌‌ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మిల్లింగ్ కెపాసిటీకి అనుగుణంగా మిల్లింగ్ జరగడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు ఒక షిఫ్ట్ లో 71వేల టన్నలు, రెండు షిఫ్ట్ ల్లో 1.40 లక్షల టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేసే కెపాసిటీ ఉందన్నారు. అయితే ఏ ఒక్కరోజు కూడా కెపాసిటీకి తగ్గట్టుగా మిల్లింగ్ జరగడంలేదని కమిషనర్‌‌‌‌ మండిపడ్డారు.

రేషన్‌‌‌‌ బియ్యం క్వాలిటీ పెరగాలి

రేషన్​షాపుల ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యం క్వాలిటీ పెంచాలనీ.. ఈ విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని అధికారులను చౌహాన్ ఆదేశించారు. కొంత మంది అధికారులు అవసరానికి మించి అధిక మొత్తంలో గన్నీ సంచులను సేకరిస్తున్నారని చెప్పారు. అలా సేకరించిన వాటిలో 20 శాతం నుంచి 30 శాతం వాడుకోకుండా జిల్లాల్లో ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఎంక్వైరీకి ఆదేశించినట్టు చెప్పారు. వచ్చే సీజన్ నుంచి ఇటువంటి విధానాలకు స్వస్తి పలకాలని హెచ్చరించారు.