బరువు తగ్గాలంటే రైస్ మానెయ్యాలా?

బరువు తగ్గాలంటే రైస్ మానెయ్యాలా?

గజిబిజి లైఫ్‌‌లో ఆరోగ్యం మీద చాలా మంది దృష్టి పెట్టడం లేదు. నచ్చిన ఫుడ్‌‌ను అతిగా తింటూ ఊబకాయం బారిన పడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అంటూ రుచిగా ఉండే ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం, సరైన శారీరక శ్రమ లేకపోవడం బరువు పెరగడానికి కారణాలుగా చెప్పొచ్చు. వీటితో పాటు వ్యాయామం, యోగా, జిమ్ లాంటివి చేయకపోవడం కూడా ఓవర్‌‌వెయిట్‌‌ అయ్యేందుకు దోహదపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వేటిని తినాలి, ఎలాంటి ఫుడ్‌‌ను తీసుకుంటే బరువు తగ్గొచ్చనేది ఆసక్తికరంగా మారింది. ఫలానా ఫుడ్ తీసుకుంటే బరువు తగ్గుతామనే దానిపై డైట్ ప్లాన్స్ అంటూ నెట్‌‌లో చాలా దొరుకుతాయి.

బరువు తగ్గాలనుకునే వాళ్లు సంప్రదాయ భోజనమైన అన్నాన్ని మానేయాలని కొందరు సూచిస్తుంటారు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేడ్ల వల్ల బరువు పెరుగుతారని అంటుంటారు. కానీ మన దేశంలో వరి ప్రధాన పంట. సౌతిండియాలో అన్నం తినని వారుండరంటే అతిశయోక్తి కాదు. దక్షిణాదితోపాటు ఉత్తర భారత్‌‌లోనూ రైస్‌‌ను చాలా మంది తింటారు. ఈ నేపథ్యంలో రైస్‌‌ను పూర్తిగా మానెయ్యకుండా కొంతమేర తింటే సరిపోతుందని సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్ చెప్పారు. రోజు మొత్తంలో కొంత మొత్తంలో రైస్‌‌ను భోజనంలో తినొచ్చని సూచిస్తున్నారు. అన్నం వల్ల కలిగే పలు ప్రయోజనాలను రుజుతా పేర్కొన్నారు.

మలబద్ధకంతోపాటు ఉబ్బరమూ మటుమాయం
రైస్ ప్రీబయోటిక్‌‌గా పని చేస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. శరీరంలో మంచి బ్యాక్టీరియాకు అవసరమైన వాతావరణాన్ని అన్నం పెంపొందిస్తుంది. అలాగే ఐబీఎస్ సింప్టమ్స్‌‌ను కూడా తగ్గిస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం లాంటి వాటికి రైస్ తినడం ద్వారా చెక్ పెట్టొచ్చు.

ఒత్తిడి, అలసట హుష్
రాత్రి వేళ భోజనంలో రైస్ సూప్ తీసుకుంటే పొట్టతోపాటు నరాలకు ఉపశమనం కలుగుతుంది. అలాగే దీని వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది. హార్మోన్ల నియంత్రణతోపాటు ఎక్సర్‌‌సైజ్ పెర్ఫామెన్స్‌‌ను పెంచడంలోనూ రైస్ తోడ్పడుతుంది.

థైరాయిడ్, డయాబెటిస్‌‌కు చెక్
పప్పులు, కూరగాయలతోపాటు కొంత మేర అన్నాన్ని భోజనంలో తీసుకుంటే శరీరంలో పోషకాల సమీకరణ సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ బీ12, డీ, హిమోగ్లోబిన్ లోపం ఉన్న వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. భారత్‌‌లో చాలా రకాలుగా వరిని పండిస్తారు. అయితే ఒకే రకమైన వరిని వండుకోవడం కంటే ఉడికించిన అన్నం, జీరా రైస్, పులావ్, బిర్యానీ, రాజ్మా రైస్, చోళే రైస్‌‌లుగా తయారు చేసుకొని తింటే మంచిది. ఒక్కసారి మాత్రమే పాలిష్ చేసిన బియ్యాన్ని తింటేనే ఈ ప్రయోజనాలు కలుగుతాయని రుజుతా పేర్కొన్నారు.