ఎఫ్​సీఐకి ఇన్​టైంలో అందని బియ్యం

ఎఫ్​సీఐకి ఇన్​టైంలో అందని బియ్యం
  •     ఇవ్వాల్సింది 47.04 లక్షల టన్నులు
  •     ఇచ్చింది 25.86 లక్షల టన్నులే

హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్​సీఐ) అడిగిన బియ్యంలో సగం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్​టైంలో ఇవ్వడం లేదు. నిరుడు వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన వడ్లలో.. 45శాతం మిల్లింగ్‌‌‌‌ కూడా కంప్లీట్​ కాలేదు. వరి సాగు మస్తు పెరిగిందని చెప్పే సర్కారు.. మిల్లింగ్‌‌‌‌ చేయించే ఏర్పాట్లలో మాత్రం విఫమవుతున్నది. నిరుడు వానాకాలం వడ్లు, గత యాసంగి 50.12 లక్షల టన్నులు కలిపి ఇంకా మొత్తం 87లక్షల టన్నులకు పైగా వడ్లు మిల్లింగ్‌‌‌‌ కావాల్సి ఉంది. నిరుడు వానాకాలం వడ్లు ఈ నెలాఖరుకే మిల్లింగ్‌‌‌‌ చేసి ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. గత వానాకాలంలో 70.22లక్షల టన్నుల వడ్లు సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ శాఖ సేకరించింది. 6 నెలల్లో ఈ వడ్లను మిల్లింగ్‌‌‌‌ చేసి 47.04లక్షల టన్నులు ఎఫ్‌‌‌‌సీఐకి అప్పగించాల్సి ఉంది. ఇప్పటిదాకా 25.86 లక్షల టన్నుల బియ్యాన్నే అందించింది. ఇంకా 21.19 లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. గత నెలాఖరు వరకే గడువు ఉండగా, తాజాగా సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ అభ్యర్థన మేరకు సెప్టెంబర్​30 దాకా కేంద్రం పొడిగించింది. 

గత యాసంగి వడ్ల మిల్లింగ్‌‌‌‌ నూక శాతం తేలలే

గత యాసంగిలో సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ రైతుల నుంచి 50.12లక్షల టన్నుల వడ్లు సేకరించింది. 9లక్షల టన్నుల బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ ఎఫ్​సీఐకి ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 10వేల టన్నులే అందజేసింది. మిగితాది రా రైస్​ రూపంలో ఎఫ్​సీఐకి ఇవ్వాల్సి ఉంది. నూక శాతంపై మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. కమిటీ వేసి సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4 నెలలవుతున్నా.. నూక శాతం తేల్చలేదు. రాష్ట్రంలో 2,476 మిల్లులున్నాయి. ఇందులో రా రైస్‌‌‌‌ మిల్లులు 1,534  ఉన్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో 41,166 టన్నులు బియ్యం మిల్లింగ్‌‌‌‌ చేస్తాయి. బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌  మిల్లులు 942 ఉండగా.. రెండు షిఫ్టుల్లో రోజుకు 72,120 టన్నుల బియ్యం మిల్లింగ్‌‌‌‌  చేస్తాయి. రోజూ రెండు షిఫ్టుల్లో పనిచేసినా.. రోజుకు ఐదారు వేలు టన్నుల మిల్లింగ్‌‌‌‌ మాత్రమే జరుగుతున్నాయి. నిరుడు వానాకాలంలో వడ్లు సేకరించి 8 నెలలైనా ఇంకా 45 శాతం మిల్లింగ్‌‌‌‌  పూర్తికాలేదు. ఇది పూర్తికావడానికి మరో 6 నెలలు పట్టే చాన్స్​ ఉందని అంచనా.