ఏనుగును ఎలుక గుద్దినట్టుంది..ఇండియాపై ట్రంప్ టారిఫ్‎లతో బ్రిక్స్ కూటమి బలపడ్తది: రిచర్డ్ వాల్ఫ్

ఏనుగును ఎలుక గుద్దినట్టుంది..ఇండియాపై ట్రంప్ టారిఫ్‎లతో బ్రిక్స్ కూటమి బలపడ్తది: రిచర్డ్ వాల్ఫ్

న్యూయార్క్: ఇండియాపై అమెరికా భారీగా టారిఫ్‎లు వేయడం అనేది ఏనుగును ఎలుక పిడిగుద్దు గుద్దినట్టుగా ఉందని అమెరికన్ ఎకనమిస్ట్ రిచర్డ్ వాల్ఫ్ అన్నారు. తన కాలికి తానే గన్‎తో షూట్ చేసుకున్న వ్యక్తి ప్రపంచంలో అందరికంటే తానే చాలా దృఢంగా ఉన్నానని యాక్టింగ్ చేసినట్లుగా ట్రంప్ తీరుందని విమర్శించారు. ‘రష్యా టుడే’ మీడియా సంస్థకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు.

‘‘ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండియా.. అలాంటి దేశానికి ఏం చేయాలో చెప్పాలని ఆదేశించడం అంటే ఏనుగును ఎలుక గుద్దినట్టే అవుతుంది. అంతేకాదు.. ట్రంప్ తీరుతో వెస్ట్రన్ కంట్రీస్‎కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా, ఇతర దేశాల కూటమి) మరింత బలోపేతం అవుతుంది” అని వాల్ఫ్ చెప్పారు. రష్యా నుంచి చమురు కొంటున్నదుకు ఇండియాకు పనిష్మెంట్​గా 50% టారిఫ్​లు విధించారు. 

అయితే, అమెరికా ఆంక్షలు విధించినా.. రష్యా తన చమురుకు కొత్త మార్కెట్‎ను క్రియేట్ చేసుకుంది. అలాగే ఇండియా కూడా అమెరికా మార్కెట్‎ను వదులుకుని బ్రిక్స్ దేశాలతోపాటు ఇతర దేశాలకు తన వస్తువులు అమ్ముతుంది” అని ఆయన తెలిపారు. ‘‘ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలోని దేశాలన్నీ కలిపి ప్రపంచ ఉత్పత్తిలో 35% వాటా కలిగి ఉన్నాయి. మరోవైపు అమెరికా, ఈయూ, తదితర దేశాలతోకూడిన జీ7 కూటమి వాటా 28 శాతమే. ప్రస్తుతం బ్రిక్స్ కూటమి రోజురోజుకూ బలపడుతున్నది. మనం చరిత్రలో కీలక మలుపును చూస్తున్నాం” అని వాల్ఫ్ అభిప్రాయపడ్డారు.