ఏం గుండెరా అది: మూడు గంటలు.. గాల్లో తలకిందులుగా

ఏం గుండెరా అది: మూడు గంటలు.. గాల్లో తలకిందులుగా

రోలర్ కోస్టర్ ఎక్కడమంటే పిల్లలకే కాదు.. పెద్దలకు సరదానే. భయం ఉన్నా.. దానిని బయటకి కనపడనివ్వకుండా గట్టిగా పట్టుకొని ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ స్వారీ చేస్తుంటారు. అయితే ఈ సరదా కొందరకి జీవితంలో మరోసారి రోలర్ కోస్టర్ ఎక్కకూడదనే భయాన్ని చూపించింది. 

ఇంతకీ ఏం జరిగిందంటారా! సాంకేతిక సమస్య తలెత్తడంతో రోలర్ కోస్టర్ 3 గంటలపాటు ఆగిపోయింది. దీంతో అందులోని వారు తలకిందులుగా అలానే ఉండిపోయారు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని క్రాండన్‌ పార్క్‌లో ఫారెస్ట్‌ కౌంటీ ఫెస్టివల్‌ జరిగింది. అక్కడకి వచ్చేసిన ఔత్సాహికులు సరదా కోసం రోలర్ కోస్టర్ ఎక్కారు. కాసేపు గాల్లో గింగిరాలు తిరిగాక.. ఉన్నట్టుండి అది ఆగిపోయింది. అప్పటికే అందులోకి ఎక్కినవారు తలకిందులుగా వేలాడుతున్నారు. నిర్వాహకులు ఎంత ప్రయత్నించినా అది ముందుకు కదలలేదు. దీంతో మరోదారి లేక వారు.. రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 

సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వారిని సురక్షితంగా కిందకు దించారు. దాదాపు 3 గంటలపాటు వారు అలానే తలకిందులుగా వేలాడటం గమనార్హం. ఆ మూడు గంటలు వారు ప్రాణ భయంతో ఊపిరి బిగబట్టుకొని నరకయాతన చూశారట. ఏమాత్రం పట్టు తప్పినా దారుణం జరిగుండేదని సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.