
టీమిండియా క్రికెటర్, ఫినిషర్ రింకూ సింగ్ ప్రస్తుతం ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవలే జరిగిన ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్ లో సత్తా చాటిన రింకూ.. ఈ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన ఆటగాళ్ల లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఏడాది కాలంగా పెద్దగా ఫామ్ లో లేకపోయినా రింకూ సింగ్ ఆసియా కప్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టులో మాత్రమే కొనసాగుతున్న ఈ యూపీ కుర్రాడు టీమిండియా తరపున అన్ని ఫార్మాట్ లలో ఆడాలనే తన కోరికను వెల్లడించాడు. తనపై వస్తున్న టీ20 స్పెషలిస్ట్ ట్యాగ్ ను తొలగించుకోవాలని కోరుకుంటున్నాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ మాట్లాడుతూ.." నేను సిక్స్‌లు కొట్టినప్పుడు ఫ్యాన్స్ ఇష్టపడతారని నాకు తెలుసు. దానికి నేను నిజంగా కృతజ్ఞుడను. కానీ నా రంజీ ట్రోఫీ యావరేజ్ చాలా బాగుంది. రంజీల్లో నా యావరేజ్ 55 కంటే ఎక్కువగా ఉంది. నేను రెడ్-బాల్ క్రికెట్ ఆడటం నిజంగా ఆస్వాదిస్తాను. టీమిండియాకు ఇప్పటివరకు రెండు వన్డేలు ఆడాను. వాటిలో ఒక మ్యాచ్ లో బాగా రాణించాను. నేను కేవలం టీ20 ఆటగాడిని కాదు. నాకు అవకాశం వస్తే ప్రతి ఫార్మాట్‌లోనూ మంచి ప్రదర్శన ఇవ్వగలనని నేను నమ్ముతున్నాను. ఒక ఫార్మాట్ ఆటగాడిగా ట్యాగ్ చేయబడటం నాకు ఇష్టం లేదు". అని రింకు సింగ్ అన్నాడు.
రింకూ సింగ్ ఇప్పటివరకు 50 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ల్లో 3336 పరుగులు చేశాడు. వీటిలో 22 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి. యావరేజ్ 54.68 ఉండడం విశేషం. భవిష్యత్తులో ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ ఆడాలనేది తన కల అని.. అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని రింకు చెప్పాడు. టెస్ట్ ఆశయాలు ఉన్నప్పటికీ, రింకు సుదీర్ఘ ఫార్మాట్ లో మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఈ యూపీ బ్యాటర్ కు ప్రస్తుతం జరుగుతున్న సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ జట్టులో చోటు దక్కలేదు.