
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లా పెనుబల్లి రెవెన్యూ కార్యాలయానికి బదిలీపై రావాలంటేనే ఆర్ఐ లు భయపడుతున్నారు. తహసీల్దార్ ప్రవర్తనతో ఇక్కడకు బదిలీ పై వచ్చేందుకు ఆర్ఐ లు ఆసక్తి చూపడం లేదనే చర్చ నడుస్తోంది. కార్యాలయం లో ఆర్ఐల బదిలీ జరిగి రెండు వారాలు అయినా విధుల్లో చేరడం లేదు. దీనిపై కొంతమంది రైతులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కి ఫిర్యాదు చేయడంతో ఈనెల 15 న ఇద్దరు ఆర్ఐ లను కలెక్టరేట్ కు అటాచ్ చేసి 19న ఆర్ఐ1 జగదీశ్ ను ఏన్కూర్ మండలానికి, ఆర్ఐ2 విజయభాస్కర్ ను సింగరేణి మండలానికి బదిలీ చేసి అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్ఐ లు నరసింహారావు, శ్రీనివాసరావును పెనుబల్లి మండలానికి బదిలీ చేశారు.
కానీ బదిలీ తరువాత వారం గడిచినా పెనుబల్లి కార్యాలయంలో విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఈనెల 22న మరోసారి ఆర్ఐల బదిలీ చేపట్టి కామేపల్లి మండలం ఆర్ఐ1 సక్రు, కల్లూరు ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న పూర్ణచందర్ ను పెనుబల్లి ఆర్ఐలుగా బదిలీ చేశారు. వీరు కూడా నాలుగు రోజులు గడుస్తున్నా పెనుబల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో రిపోర్ట్ చేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆర్ఐల నియామకం మళ్లీ మొదటికి వచ్చింది. ఇక్కడ రెండు వారాలుగా రెవెన్యూ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
కారణం ఇదేనా..?
పెనుబల్లి తహసీల్దార్ గా రెండు నెలల కింద బాధ్యతలు చేపట్టిన సూర్యనారాయణ మూర్తి ప్రవర్తన వివాదాస్పదంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆయన బాధ్యతలు చేపట్టాక వాస్తు లేదంటూ కార్యాలయం దర్వాజాలు బంద్ చేయించి ఓకే దారిని వాడాలని ఆదేశించడం, కింది స్థాయి సిబ్బందిని అసభ్యంగా తిట్టడం, వారి పర్సనల్ ఫోన్లు తీసుకుని ఫోన్ పే, వాట్సాప్ లు చెక్ చేస్తున్నాడనే ఆరోణలు వచ్చాయి. బోనాల పండుగ రెండవరోజు పబ్లిక్ హాలీడే ఉన్నప్పటికీ మహిళా ఉద్యోగులను డ్యూటీ చేయించినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల కింద ఓ విద్యార్థినికి కౌన్సిలింగ్ ఉందని చెప్పినా సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థిని కార్యాలయం ముందు ధర్నా చేయడం, ఇష్యూ పెద్దగా అయ్యే అవకాశం ఉండడంతో వెంటనే సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలిసింది. కార్యాలయంలో ఉద్యోగులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతుండటంతో ఇక్కడకు బదిలీపై వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కాగా, ఆర్ఐలు రెండు వారాలుగా లేకపోవడంతో విద్యార్థుల సర్టిఫికెట్స్ జారీ, రిజిస్ట్రేషన్ ఫైనల్ రిపోర్ట్స్, రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి.
ఆర్ఐలు డ్యూటీలో చేరేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై తహసీల్దార్ సూర్యనారాయణ మూర్తిని వివరణ కోరగా ఆర్ఐలు రాకపోవడానికి కారణం తనకు తెలియదన్నారు. కిందిస్థాయి సిబ్బంది కూడా తన వల్ల ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.