
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో వచ్చిన 'కాంతార: చాప్టర్ 1' రికార్డులు సృష్టిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ. 675 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలతో దూసుకెళ్తోంది. బాలీవుడ్ చిత్రాలను సైతం బోల్తా కొట్టించి ఒక ప్రాంతీయ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అందరి మన్ననలు పొందుతోంది. అయితే ఇంతటి విజయాన్ని సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి.. స్టార్‌డమ్, గ్లామర్‌కు ముందు ఆయన జీవితం సులభంగా సాగలేదు. ఆయన జీవితమే ఒక అద్భుతమైన సినిమా కథను తలిపిస్తోంది. ఇప్పుడు ఈ హీరో లైఫ్ గురించి ఆసక్తకర విషయాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
డ్రైవర్ గా జీవితం మొదలు పెట్టి..
తారల వెలుగు, ఆడంబరాలకు దూరంగా, రిషబ్ శెట్టి జీవితం తొలి రోజుల్లో కష్టాల మలుపులే ఎక్కువ. సినిమాలపై మక్కువ ఉన్నా, బతుకు తెరువు కోసం బాలీవుడ్ సినిమా నిర్మాణ సంస్థలో మొదట డ్రైవర్‌గా, ఆపై ఆఫీస్ బాయ్‌గా పనిచేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లోనే ముంబైలోని కిక్కిరిసిన వీధుల్లో తన ఆశలను, కలలను వెంటాడాడు. పేగులకు చిరు తిండిగా దొరికిన వడా పావ్, పాప్‌కార్న్‌తోనే ఆకలిని తీర్చుకున్నాడు. అయితే, తన మనసులో ఉన్న బలమైన కథలు, వాటిని తెరపై ఆవిష్కరించాలనే తపన రిషబ్‌ను ముందుకు నడిపించాయి. ఈ కష్టాలే, ఆయన సినిమా ప్రయాణానికి బలమైన పునాది వేశాయి. నేడు భారతీయ చలనచిత్ర పరిశ్రమనే ఒక ఊపు ఊపిన 'కాంతార' లాంటి మాస్టర్‌పీస్‌తో జాతీయ పురస్కారాన్ని అందుకున్నాడు.
కన్నడ సినీ రథసారథిగా..
నటుడిగా రిషబ్ శెట్టి ప్రయాణం 2013లో 'తుగ్లక్'తో మొదలైంది. 'లూసియా' (2013), 'ఉళిదవారు కండంటే' (2014) చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించి నటుడిగా గుర్తింపు సాధించారు. అయితే, ఆయన ప్రతిభ కేవలం నటనకే పరిమితం కాలేదు. 2016లో 'రిక్కీ' చిత్రంతో దర్శకుడిగా మారి, 2017లో వచ్చిన యూత్‌ఫుల్ బ్లాక్‌బస్టర్ 'కిరిక్ పార్టీ'తో కన్నడ సినిమా చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించారు. ఈ సినిమా ఆయనకు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ చిత్రంతోనే రష్మిక సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'బెల్ బాటమ్' (2019), 'గరుడ గమన వృషభ వాహన' (2021) లాంటి విభిన్న కథాంశాలతో కన్నడ చిత్ర పరిశ్రమలో రిషబ్ శెట్టి ఒక అగ్రశ్రేణి పేరుగా స్థిరపడ్డారు. ముఖ్యంగా, 'హీరో' (2021) సినిమా ద్వారా నటి, నిర్మాత భావనతో ఆయన ఏర్పరచుకున్న స్నేహం... ఆయన బహుముఖ కళాకారుడి ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలిచింది.
'కాంతార': సినిమా సత్తా..
రిషబ్ శెట్టి కెరీర్‌ను, భారతీయ సినిమా గమనాన్నే మార్చేసింది మాత్రం 2022లో వచ్చిన 'కాంతార'. స్థానిక జానపద కథ, దైవ నమ్మకం, మానవ సంబంధాల్లోని నిజమైన ఉద్వేగాలను అద్భుతంగా మేళవించి చూపించారు. ఈ సినిమా కేవలం కన్నడలోనే కాదు, దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక ప్రభావాన్ని సృష్టించింది. రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం, రిషబ్ శెట్టిని దేశవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన స్టార్‌గా నిలబెట్టింది. 'కాంతార'లో ఆయన అసాధారణ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం లభించడం ప్రాంతీయ సినిమా సత్తాను చాటి చెప్పింది.
ఇప్పుడు 'కాంతార: చాప్టర్ 1'తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తున్న రిషబ్ శెట్టి, కేవలం నటుడు, దర్శకుడు మాత్రమే కాదు, భారతీయ సినిమాలో కథ చెప్పే విధానాన్ని కొత్తగా నిర్వచించిన ఒక సృజనకారుడుగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఒకప్పుడు నిర్మాత కారు డ్రైవర్ సీటు నుండి నేడు ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించే స్థాయికి ఎదిగిన ఆయన కథ, నిజంగానే కలలు కనే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ప్రేరణా శక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదని అభినందిస్తున్నారు. దృఢ సంకల్పం, పట్టుదల, తనలోని కథను నమ్మే ధైర్యం... ఈ లక్షణాలకు నిలువెత్తు నిదర్శనం రిషబ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు .