న్యూజిలాండ్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు భారత జట్టు బుధవారం (జనవరి 7) బరోడాలో సమావేశమవుతుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం (జనవరి 11) ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. వడోదర వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. తొలి వన్డే కోసం టీమిండియా వడోదర వెళ్లే జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ లేరు. వీరిద్దరూ దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని నిర్ణయించుకున్నారు. గురువారం (జనవరి 8) పంత్, ఢిల్లీ తరపున.. అయ్యర్ ముంబై తరపున ప్రాతినిధ్యం వహించనున్నారు.
విజయ్ హజారే ట్రోఫీలో పంత్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ లో రాహుల్ కు పంత్ బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పంత్ రాణిస్తున్నాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలతో 212 పరుగులు చేసి కివీస్ తో సిరీస్ కు ముందు ఫామ్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. 2024 ఆగస్టు తర్వాత పంత్ టీమిండియా తరపున పంత్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. పంత్ తో పాటు వికెట్ కీపర్ గా ఇషాన్ కిషాన్ కూడా భారత జట్టులో ఉన్నాడు.
రీ ఎంట్రీ లో ముంబై కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయాస్ అయ్యర్ తొలి మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో రాణించాడు. హిమాచల్ ప్రదేశ్ పై 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి అదరగొట్టాడు. శ్రేయాస్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. ఈ మ్యాచ్ లో ముంబై టాప్ స్కోరర్ అయ్యర్ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్ తో న్యూజిలాండ్ తో సిరీస్ కు ముందు అయ్యర్ ఫామ్, ఫిట్ నెస్ పై ఉన్న సందేహాలు తొలగిపోయాయి. అయ్యర్ కివీస్ తో సిరీస్ కు ముందు మరో మ్యాచ్ ఆడాలనే తన నిర్ణయాన్ని తెలియ జేశాడు. దీంతో మ్యాచ్ భారత జట్టులో జనవరి 9 లేదా 10న చేరనున్నాడు.
