
బ్రిటన్: టీమిండియా వికెట్ కీపర్, టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA దేశాలు) దేశాలపై అత్యధిక (15) హాఫ్ సెంచరీలు సాధించిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డ్ సృష్టించాడు. తద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని రికార్డ్‌ను బద్దలు కొట్టాడు పంత్. ఇప్పటి వరకు ఈ రికార్డ్ ధోని పేరిట ఉండేది. సేనా దేశాలపై కెప్టెన్ కూల్ 14 సార్లు అర్ధ సెంచరీ చేశాడు. మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్ ఫస్ట్ ఇన్సింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన పంత్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు.
ALSO READ | IND vs ENG 2025: 5 వికెట్లతో చెలరేగిన స్టోక్స్.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఆలౌట్
ఇదే కాకుండా ధోని మరో రికార్డును కూడా పంత్ అధిగమించాడు. సేనా దేశాలలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత కీపర్‌గా ధోని రికార్డును కూడా రిషబ్ పంత్ బద్దలు కొట్టాడు. కాగా, ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచుల సిరీస్‌లో టీమిండియా పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మరీ ముఖ్యంగా మాంచెస్టర్ టెస్టులో పంత్ చూపించిన తెగువకు హ్యాట్యాఫ్స్ చెప్పాల్సిందే. నాలుగో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో కాలికి గాయమై రక్తం వచ్చిన పంత్ వెనక్కి తగ్గకుండా జట్టు కోసం నొప్పితోనే బ్యాటింగ్‌కు దిగి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. నొప్పితో అల్లాడుతూనే పంత్ ఈ మ్యాచులో హాఫ్ సెంచరీ (54) సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మాంచెస్టర్ టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్సింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌట్ అయ్యింది. యశస్వీ జైశ్వాల్ (58), సాయి సుదర్శన్ (61), రిషబ్ పంత్ (54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ 46, శార్థుల్ ఠాకూర్ 41 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 5 వికెట్లతో చెలరేగాడు. జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు పడగొట్టగా.. వోక్స్, డాసన్ చెరో వికెట్ తీశారు. అనంతరం అతిథ్య ఇంగ్లాండ్ దూకుడుగా ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభించింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (78), బెన్ డకెట్ (71) వన్డే తరహాలో చెలరేగి ఆడుతున్నారు. ఫస్ట్ వికెట్ కోసం టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సేనా దేశాలపై అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్స్:
రిషబ్ పంత్ - 15
ఎంఎస్ ధోని - 14
జాన్ వెయిట్ - 12
ఆడమ్ గిల్‌క్రిస్ట్ - 11
దినేష్ రామ్‌దిన్ - 10