IND vs ENG 2025: 5 వికెట్లతో చెలరేగిన స్టోక్స్.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఆలౌట్

IND vs ENG 2025: 5 వికెట్లతో చెలరేగిన స్టోక్స్.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఆలౌట్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్ లో 358 పరుగులకు ఆలౌట్ అయింది. నాలుగు వికెట్ల నష్టానికి 264 పరుగులతో ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా చివరి ఆరు వికెట్లను 94 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. తొలి రోజు 61 పరుగులు చేసిన సాయి సుదర్శన్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.  ఓపెనర్ జైశ్వాల్ (58), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. 

కేఎల్ రాహుల్ (46), శార్దూల్ ఠాకూర్ (41) జట్టుకు కీలకమైన పరుగులు అందించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ స్టోక్స్ 5 వికెట్లు పడగొట్టాడు. ఆర్చర్ మూడు వికెట్లు తీసుకోగా.. డాసన్, వోక్స్ లకు తలో వికెట్ దక్కింది. 4 వికెట్ల నష్టానికి 264 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ సేన ప్రారంభంలోనే జడేజా వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో సుందర్, ఠాకూర్ కలిసి 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. లంచ్ కు ముందు 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శార్దూల్ ఔట్ కావడంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 

►ALSO READ | IND vs ENG 2025: వివాదాస్పద క్యాచ్‌కు జడేజా ఔట్.. ఇంగ్లాండ్‌కు అనుకూలంగా అంపైర్ నిర్ణయం

రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే లంచ్ తర్వాత చివరి నాలుగు వికెట్లను 27 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఒక షార్ట్ డెలివరీతో సుందర్ (27) ను స్టోక్స్ ఔట్ చేశాడు. ఇదే ఊపులో ఒక స్టన్నింగ్ డెలివరీతో కంబోజ్ ను పెవిలియన్ కు పంపాడు. గాయంతోనే బరిలోకి దిగిన పంత్.. హాఫ్ సెంచరీ (54) తర్వాత ఆర్చర్ విసిరిన ఇన్ స్వింగ్ కు ఔటయ్యాడు. బుమ్రా (4) చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.