- రూ. 4.50 నుంచి రూ. 5 మధ్య పలుకుతున్న ఎగ్
- వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో పెరుగుతున్న చికెన్ రేట్లు
- యుద్ధం కారణంగా ఎగుమతి నిలిచిపోవడంతో దిగొస్తున్న గుడ్డు రేటు
కరీంనగర్, వెలుగు :
రాష్ట్రంలో ఓ వైపు చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతుంటే... మరో వైపు గుడ్డు రేటు మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. పండుగలతో పాటు పెండ్లిళ్ల సీజన్ కావడంతో చికెన్‌కు డిమాండ్ పెరుగగా.. యుద్ధం కారణంగా ఎగుమతి నిలిచిపోవడంతో గుడ్డు రేటు పడిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం చికెన్ కేజీ రూ.350 నుంచి రూ.380 మధ్య పలుకుతోంది. ఎండలు ముదురుతుండడంతో రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంతోనే చికెన్ ధర రికార్డు స్థాయికి చేరిందని, మరికొన్ని రోజుల్లో కేజీ చికెన్ రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
వారం రోజుల్లోనే పెరిగిన ధరలు
చికెన్ ధరలు వారం రోజుల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. వారం రోజుల కింద కేజీ చికెన్ రూ.320 వరకు ఉండగా.. మూడు, నాలుగు రోజులుగా రూ.350, రూ.360, రూ. 380 వరకూ పెరుగుతూ వస్తోంది. లైవ్ కోడి కిలో రూ. 220 అమ్ముతుండగా.. స్కిన్‌తో కేజీ చికెన్ రూ.340కి అమ్ముతున్నారు. చాలా మంది వ్యాపారులు పేపర్ ధరను మించి అమ్ముతుండడంతో కొన్ని చోట్ల చికెన్ సెంటర్ల నిర్వాహకులతో వినియోగదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. నాటు కోడి ధర కేజీ రూ.700 నుంచి రూ.800 మధ్య పలుకుతోంది.
ఎండల తీవ్రత, పెరిగిన ఖర్చులే కారణం
రాష్ట్రంలో సుమారు ఆరు వేల బ్రాయిలర్ కోళ్ల ఫామ్స్ ఉండగా.. వీటి ద్వారా ఏటా సుమారు 20 కోట్లకుపైగా కోళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వానాకాలం, చలికాలంలో కోళ్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటున్నప్పటికీ.. వేసవిలో మాత్రం ఎండల తీవ్రతతో ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. ఎండల కారణంగా బ్రాయిలర్ కోళ్లు చనిపోతుండడంతో మార్కెట్‌లో సప్లై తగ్గుతోంది. దీంతో పాటు ఎండల కారణంగా కోళ్లు దాణా తక్కువ తిని నీళ్లు ఎక్కువగా తాగుతుండడంతో ఆశించినంత ఎదుగుదల ఉండడంలేదు. మరోవైపు కోడి పిల్లల(చిక్స్) ధరలు, దాణా ఖర్చులు సైతం పెరిగాయి. అంతేగాక కోళ్లను కాపాడుకునేందుకు కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం పౌల్ట్రీ ఫామ్స్ నిర్వాహకులపై ఆర్థికంగా అదనపు భారంగా పడుతోంది. దీంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు వేసవిలో కోళ్ల పెంపకాన్ని నిలిపివేయడంతో సప్లై చాలా వరకు తగ్గింది.
గుడ్ల రేట్లపై వార్ ఎఫెక్ట్
చికెన్ రేట్లు అమాంతం పెరిగిపోతుంటే.. గుడ్ల రేట్లు మాత్రం తగ్గిపోతూ జనాలకు కాస్త ఊరటనిస్తున్నాయి. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలకు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు నెలల క్రితం వరకు రిటైల్‌లో రూ.8 వరకు పలికిన ఒక్కో గడ్డు.. ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. దీంతో చికెన్ కొనలేనివారు ఎగ్ కర్రీతో సరిపెట్టుకుంటున్నారు.
