హైదరాబాద్‌లో ఇళ్లకు రేటెక్కువ

హైదరాబాద్‌లో ఇళ్లకు రేటెక్కువ

దేశమంతా ఇండ్ల రేట్లు తగ్గుతుంటే హైదరాబాద్‌‌లో మాత్రం పెరుగుతున్నయ్‌‌. హర్యానాలోని గుర్గావ్‌‌, ఉత్తరప్రదేశ్‌‌లోని నోయిడాల్లో ధరలు పడిపోతుంటే మన దగ్గర మాత్రం ఎక్కువైతున్నయ్‌‌. గత ఐదేళ్లలో గుర్గావ్‌‌లో 7%, నోయిడాలో 4% ధరలు తగ్గగా హైదరాబాద్‌‌లో మాత్రం 40 శాతం పెరిగాయి. ఆన్‌‌లైన్‌‌ రియల్టీ పోర్టల్‌‌ ప్రాప్‌‌టైగర్‌‌ ఈ వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌‌లో అపార్ట్‌‌మెంట్ల రేట్లు స్క్వేర్‌‌ ఫీట్‌‌కు యావరేజ్‌‌గా రూ. 5,318 నడుస్తున్నాయి. గుర్గావ్‌‌లో యావరేజ్‌‌ రేటు స్క్వేర్‌‌ ఫీట్‌‌కు రూ. 5,236, నోయిడాలో రూ. 3,922 పలుకుతోంది. ఫైనాన్షియల్‌‌ రాజధాని ముంబై, టెక్‌‌ హబ్‌‌ బెంగళూరులో గత ఐదేళ్లలో ఇండ్ల రేట్లు బాగానే పెరిగాయని ప్రాప్‌‌టైగర్‌‌ వెల్లడించింది. ముంబైలో సరాసరి 15 శాతం, బెంగళూరులో 11 శాతం పెరిగాయంది. ప్రస్తుతం ముంబైలో స్క్వేర్‌‌ ఫీట్‌‌ రూ.9,446 పలుకుతోందని, బెంగళూరులో రూ. 5,194 నడుస్తోందని వివరించింది. అహ్మదాబాద్‌‌, చెన్నై, కోల్‌‌కతా, పుణేల్లో ధరలు చాలా తక్కువగా 2 నుంచి 4 శాతమే పెరిగాయని పేర్కొంది.

సరైన టైంకి ఇవ్వక..

దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇండ్ల ధరలు తక్కువగానే ఉన్నాయని, డిమాండ్‌‌ తగ్గడంతో రేట్లు పెరగట్లేదని ప్రాప్‌‌టైగర్‌‌ వెల్లడించింది. కొన్ని చోట్ల రేట్లు పెరిగినా చాలా తక్కువేనని చెప్పింది. ఇండియా ఫార్మాస్యూటికల్‌‌ హబ్‌‌ హైదరాబాద్‌‌లో రేట్లు బాగానే పెరిగినా 2015లో అక్కడ రేట్లు చాలా తక్కువున్నాయని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌‌ విభజన కూడా హైదరాబాద్‌‌లో రేట్లు పెరగడానికి ఓ కారణమంది. గుర్గావ్‌‌, నోయిడాల్లో డెవలపర్లు సరైన టైంకి ఇండ్లు పూర్తి చేయకపోవడం వల్లే అక్కడ రేట్లు తగ్గాయని వివరించింది. ఇక్కడ పెద్ద పెద్ద డెవలపర్లు లాస్‌‌లోకి వెళ్లిపోవడమూ ఇంకో కారణమంది.