మీరు రోడ్ సైడ్ ఫుడ్ తింటారా..? ఈ ప్రశ్న చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు. ఎందుకంటే రోడ్డు మీద ఉన్న ఫుడ్ తినని వాళ్లెవరుండరు. ఇంట్లో వంట చేయలేనప్పుడు, ఆకలేసినప్పుడో, ఉదయం టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్.. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు లాగించేస్తుంటాం. రోడ్డు మీద అందుబాటులో లేని ఆహార పదార్థాలు అంటూ ఉండవు కదా మరి. ఎప్పుడు తింటామా.. ఎప్పుడో ఒకసారి కదా అనుకునే వారు కూడా షాకయ్యే న్యూస్ చెబుతున్నారు చెన్నై ఫుడ్ సేఫ్టీ అధికారులు. చెన్నై ముచ్చట మనకెందుకు అనుకుంటారేమో.. చెన్నై అయినా హైదరాబాద్ అయినా అందరి ఆరోగ్యం ఒకటే కదా. అందుకే ఆ నిజాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
చెన్నై లో అవసరానికి తగ్గట్లుగా ఆహారం రోడ్డుపైన అందుబాటులో దొరుకుతుంది. కానీ ఇదే ఇప్పుడు చాలా సమస్యలు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా టీ నగర్, కొడంబాక్కం, అన్నా నగర్, వెలచెరీ, తంబరం, పొరూర్ తదితర ఏరియాల్లో ఫాస్ట్ ఫుడ్, స్నాక్స్, డ్రింక్స్.. ఇలా పరిశుభ్రత లేని ఆహార పదార్థాలు ఎక్కువగా దొరుకుతున్నాయి.
తక్కువ ధరకు, ఆకర్షణీయంగా ఉండే ఈ ఫుడ్ కు ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. కనీసం శుభ్రత పాటించని ఫుడ్ వల్ల అనారోగ్యాలు తెచ్చుకుంటున్నారు. సరిగ్గా శుభ్రం చేయని గిన్నెలు, సామాగ్రి, దుమ్ము, ఈగలు వాలుతున్న ఆహారం, మలినం అయిన నీళ్లు.. ఇలాంటి వన్నీ ఆరోగ్యంపై డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్లు డా.ఆర్.కార్తికేయన్ చెబుతున్నారు.
ఫుడ్ వేస్టేజ్ తో సమస్యలు:
ఈ ఏరియాల్లో ఫుడ్ వేస్టేజ్ తో వాతావరణం కలుషితం అవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వివిధ స్టాల్స్, బండ్ల దగ్గర మిగిలిన ఆహార పదార్థాలు, ప్లాస్టిక్ కవర్లు కుప్పలు కుప్పలుగా పోస్తుండటంతో కంపు కొట్టడమే కాకుండా ఈగలు, దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది దుర్వాసన రావడమే కాకుండా ఎలుకలు విపరీతంగా పెరగిపోతున్నాయి, డెంగ్యూ , గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అంతే కాకుండా వీధుల్లో ఫుడ్ స్టాల్స్ దగ్గర రద్దీ ఎక్కువగా ఉంటుండటంతో ట్రాఫిక్ ఏర్పడుతుంది. కాలినడకన వెళ్లే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు.
అయితే ఈ సమస్యలపై ఇప్పటికే చర్యలు ప్రారంభించామని చెన్నై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు చెబుతున్నారు. వీధి వ్యాపారులకు నోటీసులు అందించామని.. మధ్య మధ్యలో తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పబ్లిక్ హెల్త్ కు టైమ్ బాంబ్ లాంటి సమస్య:
వీధుల్లో అమ్మే ఆహార పదార్థాలు పూర్థిస్థాయిలో పరిశుభ్రత పాటించినప్పుడే మంచివని పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. హైజీనిక్ మెయింటైన్ చేయాలంటే అవి అమ్మేవారికి ఆరోగ్యం, శుభ్రత, రోగాలపై కనీస అవగాహన ఉండాలన్నారు. కానీ అవేమీ తెలియని వారు పరిశుభ్రత పాటించలేకపోవటం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రతి దానికీ ప్లాస్టిక్ కవర్లను వినియోగించడం.. అంటే ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లలో ఫుడ్ అమ్మటం వలన మైక్రో ప్లాస్టిక్స్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని.. కొన్నిసార్లు క్యాన్సర్ కు దారితీస్తాయని తెలిపారు.
అదే విధంగా పూరీ, బోండా లాంటి వాటి కోసం మరిగించిన ఆయిల్ మళ్లీ మళ్లీ వాడటం, అదే నూనెలో ఫ్రెష్ నూనెను కలపడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఒకరోజు మరిగించిన నూనె మళ్లీ వాడకుండా, పారబోయాలని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి వాటిపై అవాహన ఉన్నప్పుడే హైజీనిక్ మెయింటైన్ చేయగలరని తెలిపారు. ఇవన్నీ పాటిస్తున్నపుడు ఫుడ్ బయట తినటంలో నష్టం లేదని.. లేదంటే ఆరోగ్యంపై టైమ్ బాంబ్ ఫిక్స్ చేసినట్లేనని హెచ్చరిస్తున్నారు.
చెన్నై లాంటి సిటీలలో పట్టణ జనాభా పెరుగుండటంతో స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి సమయాల్లో మున్సిపాలీటీ అధికారులు, ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులు, వీధి వ్యాపారులు మధ్య సమన్వయంతో ప్రజారోగ్యానికి నష్టం రాకుండా హైజీనిక్ ఫుడ్ తయారు చేసేలా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
