వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం

వికారాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం

తెలంగాణపై వరుణుడు పగబట్టాడు. వద్దంటే వానలు కురిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వికారాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు, చెరువులు,కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దోమ మండలంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గొడుగోనిపల్లి వాగు ఉదృతంగా పారుతుండడంతో పరిగి - మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి వాగు పరివాహక ప్రాంతాల్లో వరి పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట తమ కళ్లముందే నీటిపాలు కావడంతో అన్నదాతలు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. 

జిల్లాలో వాగులు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో చేసేది ఏమీ లేక వాగులకు ఇరువైపులా వాహనాలు కిలోమీట్ల మేర నిలిచిపోయాయి. వరద ప్రవాహం తగ్గితేకానీ ప్రయాణం సాధ్యం కాదు. వాగులపై బ్రిడ్జిలు ఏర్పాటు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.  ప్రజలు వాగులు దాటకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకొని రాకపోకలు నిలిపి వేశారు.