పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంపై రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) శనివారం స్పందించింది. “ప్రజాసేవ అనేది నిరంతర ప్రయాణం. ఎత్తుపల్లాలు సహజం. ఓటమితో విచారం లేదు, విజయంతో గర్వం లేదు” అని ‘ఎక్స్’లో ఒకబ ప్రకటన చేసింది. ఆర్జేడీ పేదల పార్టీ అని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై వారి గొంతును వినిపిస్తామని తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 సీట్లలో ఆర్జేడీ 25 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇది 2010 తర్వాత ఆర్జేడీకి వచ్చిన రెండో అతి తక్కువ సీట్లు. అప్పట్లో 22 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కూటమికి 35 సీట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ 6, సీపీఎం(ఎల్) 2, సీపీఎం 1 సీటు గెలిచాయి. సీపీఐకి ఒక్క సీటు కూడా రాలేదు.
అయితే, తేజస్వీ యాదవ్ సారథ్యంలో 2020లో ఆర్జేడీ 75 సీట్లు గెలిచింది. ఈసారి ఓటమి పాలైనా 23 శాతం ఓట్లతో ఆర్జేడీ అత్యధిక ఓట్షేర్సాధించింది. ఇది బీజేపీ కంటే 2.92 శాతం, జేడీయూ కంటే 3.75 శాతం ఎక్కువ. బిహార్లో మొత్తం 66 శాతం పోలింగ్నమోదవగా.. అందులో మహిళల ఓట్ షేర్ 71.6 శాతం కావడం గమనార్హం.
