- 430 ఇంటర్ కాలేజీల్లో ఏర్పాటు చేయనున్న విద్యాశాఖ
- మిడ్డేమీల్స్, బ్రేక్ ఫాస్ట్ స్కీముతో తాగునీరు అనివార్యం
- ఇంటర్ బోర్డు నిధుల నుంచి రూ.10 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 430 జూనియర్ కాలేజీల్లో ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాలేజీల్లో మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ అందించనున్న నేపథ్యంలో.. విద్యార్థులకు మంచినీరు అందించడం తప్పనిసరి అని భావించిన ఇంటర్మీడియెట్ అధికారులు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. వచ్చే జూన్ ఒకటో తేదీ నుంచి అన్ని సర్కారు జూనియర్ కాలేజీల్లో బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ స్కీములను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. దీంతో సుమారు 2 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. అయితే, భోజనం చేసిన తర్వాత విద్యార్థులు కలుషిత నీరు తాగి అనారోగ్యం పాలు కాకుండా చూడాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. అందుకే అన్ని కాలేజీల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయడం అనివార్యమని డిసైడ్ అయింది. ఈ ఆర్‌ఓ ప్లాంట్ల ఏర్పాటుకు సుమారు రూ.10 కోట్ల బడ్జెట్ అవసరమని ఇంటర్మీడియెట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ప్రతిపాదనలు రెడీ చేశారు. అయితే, ఈ పనులకు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో.. ప్రభుత్వ అనుమతితో ఇంటర్ బోర్డు నిధుల నుంచే ఈ మొత్తాన్ని వెచ్చించాలని నిర్ణయించింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, వారిలో హాజరు శాతం పెంచి మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ కాన్సెప్ట్ కింద ఈ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. జూన్ ఫస్ట్ నాటికి బ్రేక్ ఫాస్ట్, మిడ్డేమీల్స్ స్కీములతో పాటు ఆర్‌ఓ ప్లాంట్లను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు.
సంఖ్యను బట్టి మెయింటెనెన్స్ గ్రాంట్స్..
కాలేజీలోని విద్యార్థుల సంఖ్యను బట్టి మెయింటెనెన్స్ గ్రాంట్లను అందజేసేందుకు ఇంటర్మీడియెట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 30 మందిలోపు స్టూడెంట్స్ ఉంటే నెలకు రూ.3 వేలు, 750 కంటే ఎక్కువ మంది ఉంటే గరిష్టంగా రూ.20 వేలు వరకు ప్రతి నెలా కమిటీలకు విడుదల చేయనున్నారు. 31 నుంచి వంద మంది ఉంటే రూ.6 వేలు, 101 నుంచి 250 వరకున్న కాలేజీలకు రూ.8 వేలు, 251 నుంచి 500 వరకూ రూ.12 వేలు, 501 నుంచి 750 మంది ఉంటే రూ.15 వేలు ఇవ్వనున్నారు. ప్రభుత్వ బడ్జెట్‌లో అసిస్టెన్స్ టు జీజేసీ కింద నిధులు రాకపోవడంతో ఇంటర్ బోర్డు ఫండ్స్ నుంచే ఈ భారాన్ని భరించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు కాలేజీల నిర్వహణ బాధ్యతలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరానికి గాను 430 ప్రభుత్వ కాలేజీల్లో టాయిలెట్ల క్లీనింగ్, మొక్కలకు నీళ్లు పోయడం, ప్రాంగణాల నిర్వహణ కోసం రూ.5.25 కోట్ల నిధులు కేటాయించనున్నది. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ కమిటీలు 11 నెలల పాటు కాలేజీల మెయింటెనెన్స్‌ను చూసుకోనున్నాయి. లెక్చరర్లకు ట్రైనింగ్, యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, డిజిటల్ క్లాస్ రూముల కోసం సమగ్ర శిక్ష కింద తీసుకునేలా సర్కారుకు ఇంటర్ కమిషనర్ కృష్ణ ఆదిత్య లేఖ రాశారు. అలాగే, ల్యాబ్‌ల బలోపేతంతో పాటు డ్యూయల్ డెస్కులకూ నిధులు కావాలని లేఖలో పేర్కొన్నారు.
