ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. గురువారం (జనవరి 29) ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని స్టేజి పినపాక బ్రిడ్జి దగ్గర జరిగింది ఈ ఘటన. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కొనిజర్ల మండల పరిధిలోని గోపవరం గ్రామానికి చెందిన మహిళా కూలీలు.. తల్లాడకు కూలి పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో కింద పడిపోయింది. లారీ కింద ఇరుక్కున్న మహిళలను బయటకు తీసేందుకు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 108 వాహనం ద్వారా గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
