వికసిత్​ భారత్​ కోసం వచ్చే ఐదేండ్లకు.. రోడ్ మ్యాప్ రెడీ

వికసిత్​ భారత్​ కోసం వచ్చే ఐదేండ్లకు.. రోడ్ మ్యాప్ రెడీ
  • ఇప్పటి దాకా చూసిన అభివృద్ధి ట్రైలరే: మోదీ
  • అవినీతి అంతమే విధానంగా పదేండ్లుగా ఫైట్ చేస్తున్నా
  • ఎన్డీఏ సర్కారుకు, అవినీతి గ్రూపునకు మధ్య ఫైటింగ్
  • యూపీలోని మీరట్​లో జరిగిన పార్టీ ర్యాలీలో ప్రధాని కామెంట్

మీరట్​: దేశ ప్రజలందరూ ఇప్పటిదాకా అభివృద్ధి ట్రైలర్​ మాత్రమే చూశారని, రాబోయే ఐదేండ్లలో తమ ప్రభుత్వం (మోదీ 3.0) చేయాల్సిన అభివృద్ధికి రోడ్​మ్యాప్​ సిద్ధం చేస్తున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ లోక్​సభ ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకొనేవి కాదని.. వికసిత్​ భారత్​ కోసం జరుగుతున్నవని తెలిపారు. లోక్​సభ ఎలక్షన్​ షెడ్యూల్​ విడుదల తర్వాత ఆదివారం ఉత్తరప్రదేశ్​లోని మీరట్​లో నిర్వహించిన తొలి ర్యాలీలో మోదీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ‘మూడోసారి అధికారం చేపట్టేందుకు తమ ప్రభుత్వం ప్రిపరేషన్​ ప్రారంభించింది. రాబోయే ఐదేండ్ల కోసం రోడ్​మ్యాప్​ సిద్ధం చేస్తున్నాం. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వందరోజుల్లో  ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలనేదానిపై కసరత్తు జరుగుతున్నది’ అని తెలిపారు. ‘మీరు గడిచిన పదేండ్లలో చూసిన అభివృద్ధి కేవలం ట్రైలర్​ మాత్రమే. ఇప్పుడు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి’ అని అన్నారు.  

రైతులకు ఇండియా కూటమి క్షమాపణ చెప్పాలి

చౌదరీ చరణ్​ సింగ్​లాంటి విప్లవ వీరులను దేశానికి అందించిన విప్లవాల, విప్లవకారుల గడ్డ మీరట్​ అని పేర్కొన్నారు. చౌదరీ చరణ్ ​సింగ్​కు గౌరవం ఇవ్వకుండా ఇండియా కూటమి రైతులను అవమానించిందని దుయ్యబట్టారు. ‘చరణ్​సింగ్​కు భారత రత్న ఇవ్వాలని పార్లమెంట్​లో జయంత్​ చౌదరి మాట్లాడేందుకు లేచినప్పుడు విపక్షాలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ విషయంలో కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీ (ఎస్పీ) యూపీలోని ప్రతి రైతు ఇంటికి వెళ్లి క్షమాపణలు కోరాలి’ అని డిమాండ్​ చేశారు. 

అవినీతిపై యుద్ధం చేస్తున్నా

పదేండ్లుగా తమ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. ‘పేదలనుంచి మధ్యవర్తులెవరూ డబ్బులు దోచుకోకుండా మేం భరోసా ఇచ్చాం. నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నా. అందుకే అవినీతిపరులు నేడు కటకటాల వెనుక ఉన్నారు’ అని పేర్కొన్నారు. ఈ లోక్​సభ ఎన్నికలు ఎన్డీఏ సర్కారుకు.. అవినీతి గ్రూపునకు పోరాటం అని తెలిపారు. అవినీతిపరులను తప్పించండి (భ్రష్టాచార్​ హటావో) అనేది మోదీ నినాదమని, కానీ వారు (విపక్షాలు) అవినీతిపరులను కాపాడండి (భ్రష్టాచార్​ బచావో) అంటున్నారని తెలిపారు.  

‘నేను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ప్రతిపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. మోదీని భయపెట్టాలని చూస్తున్నాయి. కానీ భారత్​ నా కుటుంబం.. నా కుటుంబాన్ని అవినీతిపరులనుంచి రక్షించేందుకు నేను చర్యలు తీసుకుంటా’ అని చెప్పారు. అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్, జేఎంఎం లీడర్​ హేమంత్​ సోరెన్​కు మద్దతుగా ఇండియా కూటమి న్యూఢిల్లీలోని రాంలీలా మైదాన్​లో ర్యాలీ నిర్వహించి, మోదీ నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించిన నేపథ్యంలో మోదీ ఎదురుదాడికి దిగారు.  

‘నేను అవినీతిపరులను మాత్రమే విచారించడం లేదు.. నా ప్రజలనుంచి అవినీతిపరులు దోచుకున్న మొత్తాన్ని తిరిగి స్వాధీనం చేసుకొని, తిరిగి దాన్ని ప్రజలకు చేరేలా చేస్తా. ఇది నేనిచ్చే గ్యారెంటీ’ అని పేర్కొన్నారు. తాను పేదరికంలో జీవించానని, తనకు పేదలు పడే బాధలు, కష్టాలు తెలుసన్నారు. అందుకే పేదలను దృష్టిలో పెట్టుకొనే పథకాలు రూపొందించామని, పేదలకు అధికారంతోపాటు ఆత్మగౌరవాన్ని తిరిగి ఇచ్చామని తెలిపారు.