
- వర్షాలతో పంచాయతీ రోడ్లు, భవనాలకు భారీ నష్టం
- 96.55 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న పంచాయతీ రోడ్లు
- శిథిలావస్థలో ఉన్న భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా పంచాయతీ రాజ్ రోడ్లు, భవనాలకు భారీ నష్టం వాటిల్లింది. రాష్ట్రవ్యాప్తంగా 96.55 కిలోమీటర్ల మేర పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. 75 ప్రాంతాల్లో రోడ్లకు నష్టం జరగగా.. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.3.40 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.49.40 కోట్లు, 88 ప్రదేశాల్లో సీడీ వర్క్స్ తాత్కాలిక పునరుద్ధరణకు రూ.1.64 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.87.74 కోట్లు అవుతుందని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు.
అలాగే, మరో 60 ప్రదేశాల్లో డ్యామేజ్ అయిన రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.1.08 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ. 5.57 కోట్లు ఖర్చు కానుంది. ఇంకో 223 ప్రాంతాల్లో రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.6.13 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.142.71 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో 35 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 14 భవనాలు వినియోగంలో లేవు. మిగిలిన 21 భవనాల్లో ఉంటున్న వారికి ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో 11 జడ్పీ క్వార్టర్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. వీటిని ఖాళీ చేయాలని నోటీసులు అందించారు.